భువనేశ్వర్: ఝార్సుగుడ ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఆమె తల్లి, సోదరుడు, మంత్రులు ప్రమీలా మల్లిక్, రీతా సాహు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఘన విజయంతో ఓటర్లు కట్టబెట్టిన గురుతర బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మార్గదర్శకంలో ఝార్సుగుడ నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో దీపాలీ దాస్ మీప ప్రత్యర్థి, బీజేపీ నాయకుడు టొంకొధొరొ త్రిపాఠిపై 48,721 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ప్రమాణ స్వీకారానికి ముందు సోదరుడు విశాల్ దాస్ ఆదివారం నవీన్ నివాస్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ విజయం ఝార్సగుడ ఉప ఎన్నికలో చారిత్రాత్మక విజయమని సీఎం అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి నాయకత్వం వహించాలని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంకితభావంతో పని చేయాలని ఆమెకు సూచించారు. ఇదిలా ఉండగా.. దీపాలి దాస్ సుమారు ఏడాది కంటే తక్కువ కాలమే ఈ పదవిలో ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉండటమే ప్రధాన కారణం.
తిరుగులేని బీజేడీ..
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 5వ విడత పాలనలో 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 7 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బిజూ జనతాదళ్ విజయ శంఖారావం చేయగా.. మరో స్థానంలో భారతీయ జనతా పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పత్తా లేకుండా పతనమైంది. 2000 తర్వాత ఈ విడతలో రాష్ట్రంలో అత్యధిక ఉప ఎన్నికలు జరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment