బాలిక ప్రసవంతో వెలుగులోకి..
విజయవాడ సింగ్‌నగర్‌లో అమానవీయ ఘటన
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్‌కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది.
అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్‌కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది.
నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్‌కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది.
బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్‌దాస్‌ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment