జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఏకైక జనరల్ స్థానం జయపురం టిక్కెట్టు కోసం అధికార బీజేడీ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. కొరాపుట్ జిల్లాలోని 5 శాసనసభ స్థానాల్లో కొరాపుట్, కోట్‌పాడ్ స్థానాలకు బీజేడీ అభ్యర్థులను ప్రకటించినా, జయపురం, లక్ష్మీపూర్, పొట్టంగి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
ముఖ్యంగా జయపురం నియోజకవర్గంలో ఎవరికి టిక్కట్టు ఇస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు కారణం గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతిని ఎదుర్కొనే నేత ఎవరా అని ఎదురు చూస్తున్నారు. అయితే అతడిని ఎదుర్కొనే అభ్యర్థి కోసం బీజేడీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి రబినారాయణ నందో టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గత రెండు ఎన్నికల్లో ఆయన బాహిణీపతి చేతిలో ఓటమి చెందారు. అందువలన రబి నందోకు టిక్కెట్టు లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది.
రబినందోపై విముఖత..?
రబినందోకు టిక్కెట్టుపై సీఎం నవీన్ పట్నాయక్ విముఖత ప్రదర్శిస్తున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటువంటి అభిప్రాయాలే 2019 ఎన్నికల సమయంలో వినిపించాయని, అయినా రబి నారాయణ నందోకు అప్పట్లో అధిష్టానం టిక్కెట్టు ఇచ్చిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అందువలన ఈసారి కూడా ఆయనకు టిక్కెట్టు లభించే అవకాశం లేకపోలేదని కొంతమంది అభిప్రాయం. అయితే ఒకవేళ పార్టీ టిక్కెట్టు తనకు లభించకపోయినా తన సతీమణికి వచ్చేటట్లు రబి నందో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిగా గతంలో పదవి నిర్వహించిన డాక్టర్ ఇందిరా నందో గత పదేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అందువలన తనకు టిక్కెట్టు రాకపోయినా తన భార్యకు రాగలదని రబి నందో ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఈసారి జయపురం బీజేడీ టిక్కెట్టు కోసం కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రాహి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత మూడు ఎన్నికల నుంచి పార్టీ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న సీనియర్ మహిళా నాయకురాలు బిందు రాణి మిశ్ర కూడా మరోసారి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలుగా ఉండేవారు. పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ రాష్ట్రస్థాయి నాయికత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. బీజేడీ టిక్కెట్టుపై ఆశావాహుల్లో రాధా బినోద్ సామంతరాయ్ పేరుకూడా వినిపిస్తున్నది. అయితే వీరిలో బీజేడీ పార్టీ అధి ష్టానం ఎవరికి టిక్కెట్టు ఇస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment