పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలి
కొరాపుట్: పాత్రికేయుల సంక్షేమానికి కొత్త ప్రభుత్వం కృషి చేయాలని ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నబరంగ్‌పూర్ జిల్లా శాఖ అధ్యక్షుడు సుశాంత్ బెహరా కోరారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రం సమీపంలో డీర్ పార్క్ సమీపంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ఇతర రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలన్నారు. పాత్రికేయులపై దాడులు జరిగితే సంఘాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఒడిశా పాత్రికేయులను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అవమానించినప్పుడు కలిసికట్టుగా పోరాటం చేసిన సంగతిని గుర్తు చేశారు. అర్హులను జర్నలిస్టులకు పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం కార్యదర్శి చిదానంద సాహు, ఉపాధ్యక్షుడు ఫల్గుణి పాత్రో తదితరులు పాల్గొన్నారు.
జలాశయంలో మునిగి మహిళ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ జలాశయంలో మునిగి ఇచ్చావాతి కిర్సనీ (40 ) అనే మహిళ మునిగి ప్రాణాలు కోల్పోయింది. చిత్రకొండ సమితి పనాస్‌పూట్ పంచాయతీ, డమ్‌గూఢ బుద కిర్సానీ భార్య ఇచ్చావాతి కిర్సనీ మంగళవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు చిత్రకొంత జలాయంలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి మునిగిపోయారు. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి గాలించారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో జోడాంబో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌చార్జి సంజాయ్ పడాసేఠి సిబ్బందితో కలిసి జలాశయం వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
టీచర్ వేధింపులు..
చిన్నారులు పరార్
● అడవిలో రక్షించిన గిరిజనులు
కొరాపుట్: ప్రధానోపాధ్యాయురాలి వేధింపులతో చిన్నారులు ఆశ్రమ పాఠశాల నుంచి పరారయ్యారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి గడబకొట్ర అశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మగ్గురు బాలురు మెయిన్ గేటు గెంతి పరారయ్యారు. వీరు దట్టమైన అటవీ ప్రాంతంలో నదులు, కొండలు దాటుకుంటూ 15 కిలోమీటర్లు నడిచారు. వన్య ప్రాణులు తిరిగే దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్నారుల కదలికలను గిరిజనులు గుర్తించి సంరక్షించారు. చిన్నారులు స్పందిస్తూ తమకు ఆశ్రమ పాఠశాలలో పెద్ద తరగతుల విద్యార్థులు వేధిస్తున్నారని, ఈ విషయం చెబితే ప్రధానోపాధ్యాయురాలు మరింత వేధించారని కన్నీరు పెట్టుకున్నారు. తమ స్వగ్రామం జొరిగాం సమితి నువాగుడకి కాలినడక పయనమయ్యామని తెలిపారు. వారికి వెంటనే గిరిజనులు బిస్కెట్లు ఇచ్చి తల్లిదండ్రులు, పాఠశాలకు సమాచారం అందజేశారు. ప్రధానోపాద్యాయురాలి భర్త హుటాహుటిన అక్కడకు చేరుకుని చిన్నారులను ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment