పిల్లలకు పునరావాసం
కొరాపుట్: మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి జైలు పాలు కాగా వారి నలుగురు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. గత నెలలో కొరాపుట్ జిల్లా బందుగాం సమితి గరిడి పంచాయతీలోని దింబగుడ గ్రామంలో రంజన్ కులసిక మద్యం మత్తులో తన భార్యని హత్య చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అంతవరకు చట్టం తన పని తాను చేసుకుపోయింది. కానీ ఆ దంపతుల నలుగురు పిల్లలు మాత్రం రోడ్డు పడ్డారు. తినడానికి తిండి లేక అలమటించి పోయారు. పిల్లలకు న్యాయం చేయాల్సిన అధికారులు వీరిని పట్టించు కోలేదు. దాంతో గ్రామస్తులే వీరికి అన్నం పెట్టారు. అదే సమయంలో గ్రామానికి వచ్చిన బీడీఓకి చిన్నారుల సమస్యను గిరిజనులు వివరించారు. వీరికి సహాయం చేస్తామని హామీ ఇచ్చిన బీడీఓ కానరాలేదు. పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఈ విషయం మీడియాలోనూ ప్రసారమైంది. ఇది చూసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు బుధవారం ఆ గ్రామానికి చేరుకుని పిల్లలను తామ పోషిస్తామని ముందుకు వచ్చారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో కొరాపుట్ జిల్లా శిశు సంక్షేమ శాఖా అధికారులు హుటాహుటిన ఆ గ్రామం చేరుకుని చిన్నారులను ప్రభుత్వ ఆశ్రమ కేంద్రానికి తరలించారు. చిన్నారులు అధికారుల వెంట వెళ్తున్నప్పుడు ఆ గ్రామ గిరిజనులకు కృతజ్ఞతగా చేతులు ఊపూతూ ముందుకు సాగారు. ఆ దృశ్యం గ్రామస్తులందరికీ కన్నీళ్లు తెప్పించింది.
భర్త చేతిలో భార్య హతం
రోడ్డున పడ్డ నలుగురు చిన్నారులు
పునరావాసం కల్పించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment