ఒకటే గమనం.. గమ్యం | - | Sakshi
Sakshi News home page

ఒకటే గమనం.. గమ్యం

Published Fri, Feb 21 2025 8:17 AM | Last Updated on Fri, Feb 21 2025 2:03 PM

-

శ్రీకాకుళంలో ముగిసిన సాఫ్ట్‌బాల్‌ శిక్షణా శిబిరాలు 

పతకమే లక్ష్యంగా కఠోర సాధన 

హాజరైన 50 మంది అథ్లెట్లు, కోచ్‌లు 

ఈ నెల 22 నుంచి మహారాష్ట్రలో సీనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: నేషనల్‌ మీట్‌కు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీనియర్స్‌ పురుషులు, మహిళల జట్లకు శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిశాయి.జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా సాగిన ఈ శిబిరాల్లో రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులు పాల్గొని నాలుగు రోజులుగా కఠోర సాధన చేశారు. గేమ్‌లో మెలకువలతోపాటు ఫిట్‌నెస్‌పై తర్ఫీదు పొందారు. జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జట్లు పతకమే లక్ష్యంగా ఇక్కడ సాధన కొనసాగింది. ఏపీ సాఫ్ట్‌బాల్‌ పురుషుల జట్టుకు ఎంపికై న ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులు ఈ శిబిరాల్లో పాల్గొనడం విశేషం. ఆతిథ్య శ్రీకాకుళం జిల్లా నుంచి మొ త్తం ముగ్గురు(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) క్రీడాకారులు ఏపీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

50 మందితో రెసిడెన్షియల్‌ క్యాంప్‌..

ఏపీ రాష్ట్ర జట్లకు ఎంపికై న క్రీడాకారులు, కోచ్‌లతో కలిపి మొత్తం 50 మందితో ఇక్కడ సాఫ్ట్‌బాల్‌ సంఘం తరఫున రెసిడెన్షియల్‌ కోచింగ్‌ పొందారు. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కలిదిండి నరసింహరాజు, కన్వీనర్‌ వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శి సిగిలిపల్లి లక్ష్మిదేవి, కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమన పర్యవేక్షించారు. క్రీడాకారులకు సీనియర్‌ ఏపీ సాఫ్ట్‌బాల్‌ కోచ్‌ ఎం.బద్రీనారాయణ(గుంటూరు), కోచ్‌ కమ్‌ నేషనల్‌ రిఫరీ జి.మహేష్‌ (నెల్లూరు), సీనియర్‌ ప్లేయర్‌ కమ్‌ కోచ్‌ ఇ.ఉమామహేశ్వరి (కర్నూలు), జిల్లాకు చెందిన పలువురు పీడీలు శిక్షణ అందించారు. మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న 46వ ఆలిండియా సీనియర్‌ నేషనల్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2025 పోటీల్లో వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు గురువారం క్రీడాకారులు పయనమయ్యారు.

సిక్కోలు క్రీడాకారులు..

శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ సీనియర్స్‌ జట్టకు ముగ్గురు ఎంపికయ్యారు. పురుషుల జట్టుకు సిద్దార్ధ మహరాణ (మందస), బుడుమూరు రామ్మోహన్‌ (కేశవరావుపేట గ్రామం– ఎచ్చెర్ల మండలం), మహిళల జట్టుకు గురుగుబెల్లి దు ర్గాప్రశాంతి (కేశవరావుపేట) ఎంపికయ్యారు. వీరు ముగ్గురు పలు జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు.

ఈ ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులే..

కోచ్‌ బద్రీనారాయణతో కలిసి కనిపిస్తున్న వీరంతా అంతర్జాతీయ క్రీడాకారులే. పి.జయవర్ధన్‌ (అనంతపురం), బి.ఫృథ్వీరాజ్‌ (అనంతపురం), ఆర్‌.లోకేష్‌ (చిత్తూరు), ఎం.బద్రీనారాయణ (కోచ్‌–గుంటూరు), బి.మహేష్‌ (అనంతపురం), బి.రాంబాబు (గుంటూరు), పి.గౌతమ్‌రాజ్‌ (కర్నూలు)జపాన్‌, నేపాల్‌, హాంకాంగ్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్లలో భారత జట్లకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement