చిరు ధాన్యాల నుంచి మద్యం!
భువనేశ్వర్: చిరుధాన్యాల నుంచి మద్యం తయారీని ప్రోత్సహించి తద్వారా గిరిజన రైతులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు సైతం ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అనుబంధ వర్గాలతో రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ప్రాథమికంగా చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుగుతాయని తెలిపారు. కొత్త విధానం రాష్ట్రంలో మహువా మద్యం, అబ్కారీ ఆదాయాలను కూడా పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
● గిరిజన వర్గాలకు వ్యవసాయ అవకాశాలను బలోపేతం చేయడానికి ప్రగతిశీల చర్యలో భాగంగా తృణధాన్యాల నుంచి మద్యం తయారీ ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను ఆవిష్కరించింది. అబ్కారీ, పరిశ్రమల శాఖలు ఈ యోచన సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నాయి.
● 2025–26 సంవత్సరానికి అబ్కారీ విధానంపై అబ్కారీ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సమీప భవిష్యత్తులో పరిశ్రమల శాఖతో కొత్త యోచన వాస్తవ కార్యాచరణ సాధ్యాసాధ్యాలపై చర్చలు జరపనున్నారు.
● అనేక కంపెనీలు చిరుధాన్యాలు, బార్లీ, బజ్రా వంటి ఆహార ధాన్యాలను ఉపయోగించి మద్యం (ఆల్కహాల్) ఉత్పత్తి చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ మహువా మద్యాన్ని మెరుగుపరచడానికి సన్నాహాలు చేస్తోంది. వివిధ రకాల రుచులతో శుద్ధి చేసిన మిశ్రమాలతో ఈ మద్యాన్ని అభివృద్ధి చేసేందుకు అబ్కారీ శాఖ నడుం బిగించింది.
● మహువా పువ్వులకు గిరాకీ పెంపొందించి గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ సన్నాహాలు దోహదపడతాయని భావిస్తున్నారు. ఈ చర్య గిరిజనులకు లాభసాటిగా ఉంటుంది. ప్రస్తుత సంప్రదాయ మద్య పానీయాల కంటే ఉన్నత ప్రమాణాల మద్య పానీయాల ఉత్పత్తి సాధ్యాసాధ్యాల్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు, కార్యాచరణ ప్రక్రియ తుది మెరుగులు దిద్దుకుంటుందని అబ్కారీ శాఖ కమిషనర్ నరసింఘ భోల్ మీడియా ప్రతినిధులకు తెలిపారు.
● ఈ చొరవ గిరిజనులకు ప్రయోజనం చేకూర్చి ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సహాయపడుతుంది. చిరు ధాన్యాల ఆధారిత (ఫింగర్ మిల్లెట్, పెర్ల్ మిల్లెట్ మొదలైనవి) మద్యం ఉత్పత్తి చేయడానికి మద్యం పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో ఇబ్బందులను తొలగించి వ్యవస్థ సరళీకృతం చేసేందుకు అబ్కారీ విభాగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది.
● అబ్కారీ విధానం 2024–25 ప్రకారం అవుట్‌స్టిల్ షాపులకు ఉన్న సి–మనీలో 1.5 శాతం పెరుగుదల, డిస్టిలరీల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా వేర్వేరు రుసుములతో టైర్డ్ లైసెన్సింగ్ ఫీజు విధానం ప్రవేశపెట్టారు. అదనపు రౌండింగ్–ఆఫ్ ఎకై ్సజ్ డ్యూటీ (ఏఆర్‌ఓఈడీ) పర్మిట్ జారీ సమయంలో అల్గోరిథమిక్ ధర సర్దుబాట్ల ద్వారా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) ప్రామాణీకరణను రూ.10 గుణకాలకు నిర్ధారించి ధర నియంత్రణకు పటిష్టమైన ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ చర్యలు 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈఎన్‌ఏ– ఆధారిత దేశీయ మద్యం ఉత్పత్తిని పర్యవేక్షణతో రాష్ట్ర అబ్కారీ విభాగం ఆదాయాన్ని 18 శాతం పెంచవచ్చని అంచనా వేశారు. సమగ్ర మద్యం అమ్మకాలలో దేశీయ మద్యం 42 శాతం వాటా కలిగి ఉంది.
గిరిజన రైతులకు లాభం..
ప్రభుత్వ ఖజానాకు ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం యోచన
సామాజిక బాధ్యత విధానాలు..
తృణ ధాన్యాల మద్యం విక్రయ దుకాణాల నిర్వ హణకు సాధారణ మద్యం దుకాణాల నియమ నిబంధనల్ని కట్టుదిట్టంగా వర్తింపజేస్తారు. విద్య, మతపరమైన సంస్థల ప్రాంతాల్లో 150 మీటర్ల పరిధిలో బఫర్ జోన్‌ను తప్పనిసరి చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అబ్కారీ కమిషనర్ ఆమోదంతో 75 మీటర్ల వరకు సడలింపు సాధ్యమయ్యే అవకాశం కల్పించారు. కొత్త అవగాహన కార్యక్రమాలలో అన్ని ఆన్ దుకాణాలలో తప్పనిసరి ’బాధ్యతాయుత వినియోగం’ సంకేతాల ప్రదర్శన, వ్యసనం నుంచి విముక్తి పొందేలా చేయడంలో పని చేస్తున్న కేంద్రాలకు 2 శాతం ఆదాయం కేటాయిస్తారు. కొత్తగా చిరు ధాన్యాల ఆధారిత మద్యం విక్రయంతో మునుపటి సంవత్సరాల కంటే 3 రెట్లు అధికంగా ఆర్థిక వనరులు మెరుగుపడే అవకాశం పట్ల పరిశీలన కొనసాగుతుంది. కాగా, చిరు ధాన్యాల మద్యాన్ని తక్కువ ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment