● ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ ● రెండోరోజూ కొనసాగిన నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కుప్పిలి కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఘటనలో సస్పెండైన 14 మంది ఉపాధ్యాయులను వెంటనే విదుల్లోకి తీసుకోవాలని, ముందస్తు ప్రణాళికతో దాడిచేసి వ్యక్తిగత మైలేజ్ కోసం జిల్లా పరువు, ప్రతిష్టతలను మంటగలిపి ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేసిన డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే విధుల నుంచి తప్పించాలనికి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సస్పెండైన టీచర్లతోపాటు డిబారైన ఐదుగురు విద్యార్థులకు న్యాయం చేయాలని నినదించారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడివేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట రెండో రోజు బుధవారం కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉమ్మడి వేదిక ముఖ్య ప్రతినిధులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్‌మోహన్, డి.శివరాంప్రసాద్, పిసిని వసంతరావు తదితరులు మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2023 సాధారణ బదిలీల నుంచి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కుప్పిలి కేంద్రంలో జరిగిన సంఘటన అతిగా చిత్రీకరించి విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి ప్రశాంతంగా పరీక్షలు రాయటంలో తీవ్ర ఆటంకం కలుగజేసిన డీఈఓపై, దాడిలో పాల్గొన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది ఉపాధ్యాయులతో చేపట్టనున్న ఉపాధ్యాయుల పోరాట ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు కొప్పల భానుమూర్తి, బమ్మిడి శ్రీరామ్మూర్తి, గొంటి గిరిధర్, సంపతిరావు కిషోర్‌కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, బల్లెడ రవి, శీర రమేష్‌బాబు, ఎంవీ రమణ, ఎస్.సత్యనారాయణ, బలివాడ ధనుంజయ్, బోనెల రమేష్, కె.పద్మావతి, బి.మోహనరావు, పప్పల రాజశేఖర్, దామోదరావు, వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.