విజయనగరం క్రైమ్: ఆపద సమయంలో ఉన్న మహిళలు, విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ ఇస్తాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆత్మరక్షణకు అవసరమైన మెలకువలను శక్తి టీమ్స్ నేర్పుతాయన్నారు. వారిలో చైతన్యం నింపుతూ, ఆపద సమయాల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత పొందేందుకుఈ ‘శక్తి టీమ్స్‘ చర్యలు చేపడతాయని చెప్పారు. ఈ మేరకు శక్తి టీమ్స్ కళాశాలలు, పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్ధినులతో మమేకమవుతాయన్నారు. ఏదైనా ఆపద సమయం ఏర్పడినపుడు, మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన జరిగినప్పుడు భయపడకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మీ రక్షణ కోసం శక్తి టీమ్స్ పని చేస్తాయని దీంతో పాటు డయల్ 112,లేదా 100 నంబర్‌లకు కాల్ చేసి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.