
తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోండి
● టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను
ఆదేశించిన కలెక్టర్
పార్వతీపురంటౌన్: జిల్లాలో నీటి నాణ్యత పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు సంయుక్తంగా నీటినాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రధాన కూడళ్లు, గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు, సంస్థలు, సంఘాల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉపాధిహామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలన్నారు. పశుసంవర్ధకశాఖ ప్రతిపాదనల మేరకు జిల్లాలో 411 పశువుల తొట్టెలను తక్షణమే నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.