
విక్రమదేవ్ వర్మ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
జయపురం: బహుముఖ ప్రజ్ఞాశాలి విక్రమదేవ్ వర్మ జీవితం, కీర్తిపై పరిశోధన కేంద్రాన్ని స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేయాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ఎల్–2 భవనంలో రాష్ట్ర ఒడియా భాష, సంస్కృతి, సాహిత్య విభాగం భువనేశ్వర్, ఒడియా సంగీత నాటక అకాడమి, జయపురం సాహిత్య పరిషత్‌లు సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సామ్రాట్ విక్రమదేవ్ వర్మ స్మృతి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయపురం సాహితీ పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని కులపతి మహేశ్వర్ నాయిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాహిణీపతి మాట్లాడుతూ రాష్ట్రానికే కీర్తి కిరీటం అయిన విక్రమదేవ్ వర్మ చరిత్రను పాఠ్యాంశంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగనే రాష్ట్ర విధాన సభలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను విధానసభలో ప్రస్తావించానని ఆయన వెల్లడించారు. ప్రముఖ సంగీత కళాకారుడు ధిరెణ్ మోహణ పట్నాయిక్, నేత్వంలో శతి పట్నాయిక్, బిశ్వజిత్ దాస్, ప్రాంశుశిబ దాస్‌ల సంగీత కార్యక్రమంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మరో కళాకారుడు జి.మహేష్ ప్లూట్ వాయిద్యంతో సభికులను అలరించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతి మహేశ్వర చంధ్ర నాయిక్ పాల్గొని రాజర్షి విక్రమదేవ్ వర్మ చరిత్రను విపులీకరించారు. మీరాడ్యాన్స్ గ్రూపు నృత్యాలు, ఒడిశ్శీ నృత్యాలతో వీక్షకులను ఉర్రూతలూగించారు. గాయకురాలు బిద్యుత్ ప్రభ పట్నాయిక్ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.