
ఘనంగా పోలీసు వ్యవస్థాపక దినోత్సవం
పర్లాకిమిడి: రాష్ట్ర పోలీసు విభాగం 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బెత్తగుడ మూడో ఆర్మ్‌డ్ పోలీసు బెటాలియన్ మైదానంలో ఉత్కళ దివాస్ సందర్భంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, ఆదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహంతి, ఆర్మ్‌డ్ బెటాలియన్ కమాండంట్ ఎ.కె.మహాంతి పాల్గొన్నారు. వివిధ విభాగాల పోలీసుల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి, గవర్నర్ కంభంపాటి హరిబాబు పోలీసుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పంపిన సందేశాన్ని ఎస్పీ చదివి వినిపించారు. అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించారు. పోలీసు విభాగంలో 2024, 2025 సంవంత్సరానికి గాను ఎస్‌ఐ. ఏపీఆర్, హవల్దార్, డి.ఐ.వి. (విజిలెన్స్) విభాగంలో ఉత్తమ సేవలు అందించిన 11 మంది సిబ్బందికి నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లను ఎస్పీ అందజేశారు. ఎస్‌ఐ దోర, ఐఐసీ (ఆదర్శ పోలీసు ష్టేషన్) ప్రశాంత్ భూపతి, హవల్దార్ డి.నాగేశ్వరరావు, ఎ.ఎస్.ఐ (జిల్లా ఇంటెలిజెన్స్) సురేంద్ర శెఠి, జగన్నాథ్ శోబోరో, సుజిత్ కుమార్ బెహరా, ఏపీఆర్ పోలీసులు ప్రభాకర్ బారిక్, ఘనశ్యాం ప్రధాన్, బిజయకుమార్ శోబోరో, అజిత్ కుమార్ పండా తదితరులకు ప్రశంపాపత్రాలను ఎస్పీ అందజేశారు.
మల్కన్‌గిరిలో ఘనంగా పోలీస్ స్థాపన దినోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఎస్‌పీ కార్యాలయ ప్రాంగణంలో 90వ పోలీస్ స్థాపన దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ హెచ్.వినోద్ పటేల్ పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టుల దాడుల్లో అమరులైన పోలీసుల ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. వారి సేవలను కొనియాడారు. 1936వ సంవత్సరంలో ఒడిశా పోలీస్ శాఖను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. అప్పటి నుంచి ఏప్రిల్ ఒకోటో తేదీ రోజును పోలీస్ స్థాపన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని ఎస్పీ చదివి వినిపించారు. విశేష సేవలు అందించిన పోలీసు సిబ్బంది అవార్డులు అందజేశారు. జిల్లా అదనపు ఎస్పీ తపాన్ నారాయణ్ రాతో, బీఎస్‌ఎఫ్ కమెండర్, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా పోలీస్ వ్యవస్థాపక దినోత్సవం
రాయగడ: రాష్ట్ర 90వ పోలీస్ వ్యస్థాపక దినోత్సవం సందర్భంగా చందిలి రిజర్వ్ పోలీస్ మైదానంలొ మంగళవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వాతి పాల్గొని పతాకావిష్కరణ చేశారు. పోలీసుల సేవలను కొనియాడారు. అనంతరం ఉత్తమ పోలీసులకు అవార్డులను అందించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఘనంగా పోలీస్ అవతరణ దినోత్సవాలు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రాల్లో 90వ ఒడిశా పోలీస్ అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మంగళ వారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్‌లో ఎస్పీ మిహిర్ కుమార్ పండా జెండా ఎగుర వేసి ఉత్సవాలు ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని పోలీస్ రిజర్వ్ మైదానంలో పోలీస్ అవతరణ దినోత్సవాలు జరిగాయి. ఎస్పీ రోహిత్ వర్మ ఉత్తమ పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఘనంగా పోలీసు వ్యవస్థాపక దినోత్సవం

ఘనంగా పోలీసు వ్యవస్థాపక దినోత్సవం