
తక్షణమే చెల్లించాలి
ఉపాధి హామీ బకాయి బిల్లులు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి వేతన దారులకు బకాయి ఉన్న 9 నుంచి 13 వారాల ఉపాధి హామీ బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉద్దేశానికి నేటి పాలకులు, అధికారులు తూట్లు పొడుస్తున్నారన్నారు. పనులు కావాలన్న వారికి 15 రోజులకు పనులు ఇవ్వాలని, లేని పక్షంలో 16వ రోజు నుంచి కార్మికులకు భృతి చెల్లించాలని చట్టం చెబుతున్నా చాలా గ్రామాల్లో ఇది అమలు కావడం లేదన్నారు. వేతనదారులకు 9 నుంచి 13 వారాల పాటు బిల్లులు చెల్లించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజువారీ వేతనం రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు.