ఎట్టకేలకు గజదొంగల ఆటకట్టు..! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు గజదొంగల ఆటకట్టు..!

Published Fri, Apr 4 2025 12:37 AM | Last Updated on Fri, Apr 4 2025 12:37 AM

ఎట్టక

ఎట్టకేలకు గజదొంగల ఆటకట్టు..!

షికారు కెళ్లినట్లు వెళ్లి..సర్వం చోరీ

17 కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు

ఒకరిది శ్రీకాకుళం జిల్లా, మరొకరిది పార్వతీపురం మన్యం జిల్లా

37 తులాల బంగారం, 20 తులాల వెండి రికవరీ

వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైమ్‌: బండిపై సాయంత్రం అలా షికారుకు వెళ్లినట్లు తామెంచుకున్న గ్రామానికి వెళ్తారు. వెంట తీసుకెళ్లిన ఫోన్లను స్విచ్చాఫ్‌ చేసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి తిరిగి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి చోరీ ఎక్కడ చేద్దామనుకున్నారో..ఆ ఇంటికి కాస్త దూరంలో బండి పార్కింగ్‌ చేసి వారివెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, స్క్రూ డ్రైవర్‌తో ఇంటి తాళాలు పగులగొడతారు. బీరువా తలుపులు విరగ్గొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి దోచుకుని పరారవుతారు. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది చోట్ల, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకచోట చోరీలు చేసి ఎట్టకేలకు కాశీబుగ్గ పోలీసులకు ఆ గజదొంగలు చిక్కారు. దీంతో వారి దగ్గర నుంచి 37 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ మేరకు నిందితులైన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చె ర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన ముద్దాడ నర్సింగరావులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.

చిన్నప్పటి నుంచే..

భాస్కరరావు తన తొమ్మిదో సంవత్సరంలోనే అప్పయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీ కాలనీలో ఓ ఇంట్లో డబ్బులు దొంగిలించడంతో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో జువైనల్‌ కేసు నమోదైంది. మూడు నెలలపాటు విశాఖ అబ్జర్వేషన్‌ హోంలో ఉన్నాడు. అప్పటి నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. ఇక నర్సింగరావు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ బైక్‌ షోరూంలో పనిచేస్తూ బైక్‌ను దొంగిలించి జైలుకు వెళ్లాడు. ఇద్దరికీ విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో పరిచయమేర్పడి బయటకొచ్చాక చోరీలు చేయడం మొదలుపెట్టారు.

లెక్కకు మించి కేసులు..

నిందితుల్లో ఒకరైన పోలా భాస్కరరావుపై శ్రీకాకుళంలో 19, విజయనగరంలో 16, విశాఖపట్నం(రూరల్‌–2) జిల్లాల్లో 37 చోరీ కేసులు నమోదుకాగా, ఎనిమిదింటిలో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. నర్సింగరావుపై 17 కేసులుండగా (శ్రీకాకుళం–9, విజయనగరం–4, విశాఖపట్నం సిటీ–3, పార్వతీపురం మన్యం–1) మూడింటిలో నేరారోపణ రుజువై జైలుశిక్ష అనుభవించాడు.

కాశీబుగ్గ పోలీసులకు చిక్కి..

గతేడాది మే 24న కాశీబుగ్గ పీఎస్‌ పరిధిలో బంగారం, వెండి చోరీ చేసిన కేసులో నిందితులైన భాస్కర్‌, నర్సింగరావులు గురువారం నర్సిపురం రైల్వేగేట్‌ ఎక్స్‌–సర్వీస్‌మ్యాన్‌ క్యాంటీన్‌ ఎదురుగా చేస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఆధ్వర్యంలో సీఐ చంద్రమౌళి నిందితులను విచారణ చేయగా వారు చేసిన ఒక్కో నేరం వెలుగులోకి వచ్చాయి. కాశీబుగ్గ, మెళియాపుట్టి, జేఆర్‌ పురం, టెక్కలి పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, శ్రీకాకుళం రూరల్‌, వన్‌టౌన్‌, టూటౌన్‌లో మూడేసి చోరీలు, పాతపట్నంలో రెండు చోరీలు చేయగా మన్యం జిల్లా పాలకొండలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు.

స్వాధీనం చేసుకున్న ఆభరణాలివే..

17 కేసుల్లో 76 తులాలకు గాను రూ.36.80 లక్షల విలువైన 37 తులాల బంగారు ఆభరణాలు, 184.58 తులాల వెండికి గాను 20 తులాల వెండి, రూ.5 లక్షలు విలువ చేసే డైమండ్‌ ఆభరణాలకు గాను రూ.2 లక్షలు విలువైన డైమండ్‌ బ్రాస్‌లెట్‌, డైమండ్‌ లాకెట్‌, రూ.3.44 లక్షల నగదుకు రూ.25 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువైన రెండు బైక్‌లు, రూ.2 లక్షల విలువైన ఓ స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించడంలో కృషిచేసిన కాశీబుగ్గ పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు.

ఎట్టకేలకు గజదొంగల ఆటకట్టు..!1
1/1

ఎట్టకేలకు గజదొంగల ఆటకట్టు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement