
మాంగనీసు తవ్వకాలపై నిషేధం
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామ పంచాయతీ పరిధి బంకురు వలసలో ‘మాంగనీసు అక్రమ తరలింపు’ అన్న కథనం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో జిల్లా భూగర్భ గనుల శాఖ స్పందించింది. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంకురువలసలో సర్వేనంబర్ 1లో ఉన్న మాంగనీసు ఖనిజ ప్రాంతం గతంలో చెలికాని అచ్యుతరావు పేరున నమోదైందని, అక్కడ మాంగనీసు ఉండేదని తెలియజేసింది. అనంతరం నమ్రతమైనింగ్ కార్పొరేషన్ పార్టనర్ ఇక్బాల్ షరీఫ్ పేరున సేల్‌డీడ్ జరిగిందని వివరించింది. అయితే అచ్యుతరావు పేరున ఉన్న భూమి ఇంకా ఇక్బాల్ షరీఫ్‌కు మ్యూటేషన్ కాలేదని, మైనింగ్ శాఖనుంచి మాంగనీసు తవ్వకాలకు, తరలింపునకు ఎటువంటి అనుమతులు లేవని పేర్కొంది. నిరంతర తనిఖీలతో ఆప్రాంతలో నిఘా ఏర్పాటు చేశామని ఎవరైనా మాంగనీసు ఖనిజతవ్వకాలు, తరలింపు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.