
రాత్రంతా కొనసాగిన సభ
రాష్ట్ర శాసన సభ
భువనేశ్వర్: శాసన సభ చరిత్రలో కొత్త రికార్డు నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాత్రి అంతా సభ నిరవధికంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు శాసన సభ రాత్రంతా కొనసాగింది. విశ్వవిద్యాలయ సవరణ బిల్లు–2024 గురువారం ఉదయం 4.29 గంటలకు ఆమోదించారు. ఆ వెంబడి రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లు 2024ను సహాయ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ ప్రవేశ పెట్టారు. విశ్వవిద్యాలయ సవరణ బిల్లుపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య సుదీర్ఘంగా వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ తరఫున సీనియర్ ఎమ్మెల్యేలు రణేంద్ర ప్రతాప్ స్వంయి, డాక్టర్ అరుణ్ కుమార్ సాహు, గణేశ్వర్ బెహరా, ధ్రువ్ చరణ్ సాహు బిల్లుకు వ్యతిరేకంగా బలమైన వాదనలు లేవనెత్తారు. ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ కూడా ప్రతిపక్షాలకు ధీటుగా స్పందించారు. అధికార పార్టీకి చెందిన దాదాపు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఓటింగ్ జరుగుతున్నప్పుడు హాజరు కాని ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి నిలదీశారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఎందుకు హాజరు కాలేదని అడిగారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు–2024పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు 3 గంటల 10 నిమిషాలకు పైగా, రణేంద్ర ప్రతాప్ స్వంయి ఒకటిన్నర గంటలకు పైగా, గణేశ్వర్ బెహెరా 1 గంటకు పైగా తమ వాదనలను వినిపించారు. ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ కూడా గంటకు పైగా ఎదురుదాడి చేశారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చర్చలో పాల్గొని ప్రతిపక్షాలను తీవ్రంగా ప్రతిఘటించారు. సుదీర్ఘంగా పన్నెండున్నర గంటల పాటు చర్చ కొనసాగింది. చర్చల తర్వాత విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2024 అసెంబ్లీలో ఆమోదించారు. ఒడిశాలో విద్యా వ్యవస్థ ఉషోదయం అవుతుందని ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్నారు. బిల్లును ఆమోదించినందుకు సభ్యులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లు ఆమోదంపై చర్చలు ప్రారంభం అయ్యాయి. విశ్వ విద్యాలయాల సవరణ బిల్లు 2024 ఆమోదం పొందిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన బిల్లును తీసుకువచ్చిందని బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ సాహు అన్నారు. 2024లో ప్రవేశపెట్టిన బిల్లు 1989 బిల్లుకు సవరణగా వ్యాఖ్యానించారు. బిల్లు చట్టబద్ధతపై తర్వాత సుప్రీంకోర్టులో చర్చిస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, శాసన సభలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందని బీజేపీ ఎమ్మెల్యే ఇరాషిస్ ఆచార్య అన్నారు. పన్నెండున్నర గంటల చర్చ తర్వాత విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఆమోదించారు. క్లాజుల వారీగా జరిగిన చర్చలో విపక్షాల సభ్యుల అన్ని సందేహాలకు ఉన్నత విద్యా శాఖ మంత్రి నివృత్తి పరిచారు. ఈ బిల్లు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయం అధికారాలను పరిమితం చేసింది. తాజా సవరణతో విశ్వ విద్యాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. కొత్త బిల్లు ప్రభుత్వ నియంత్రణను తగ్గిస్తుందని మంద్రి వివరించారు. రాత్రంతా కొనసాగిన సభా సమావేశఽంలో నిరవధికంగా హాజరై ఉండడంతో విశ్వవిద్యాలయ సవరణ బిల్లులో సంస్కరణల్ని అర్థం చేసుకునే అవకాశం లభించిందని కొత్త ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు.
ఉదయం 4.29 గంటలకు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు – 2024కు ఆమోదం
శాసన సభ చరిత్రలో రికార్డు