
టెక్కలిని మున్సిపాలిటీగా మారుస్తాం
టెక్కలి/సంతబొమ్మాళి: జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామని.. అయితే పంచాయతీగా ఉంటే సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా మున్సిపాలిటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సుమారు రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో టెక్కలి–చెట్లతాండ్ర రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా మార్గంలో పర్యటించే క్రమంలో చిరు వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే జీవనోపాధి చేస్తున్నామని ఇప్పుడు రోడ్డు విస్తరణతో రోడ్డున పడతామని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. టెక్కలిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.జాన్ సుధాకర్, టీడీపీ నాయకులు కె.హరివరప్రసాద్, బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.దమయంతి, ఎం.రాము, ఎల్.శ్రీనివాస్, కె.కామేష్, ఆర్ అండ్ బీ అధికారులు డీఈ రవికాంత్, జేఈ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు