
● హైడ్రో ప్రాజెక్టు సందర్శన
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి తెంతులిగుమ్మ పంచాయతీ కొలాబ్ నదిపై నిర్మించిన మీనాక్షి హైడ్రో పవర్ ప్రాజెక్టును ఆదివారం ఏడుగురు సభ్యుల ప్రభుత్వ అధికారుల కమిటీ సందర్శించింది. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టును సందర్శించిన కమిటీ సభ్యులు పలు విషయాలపై ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. 2020లో హైదరాబాద్ మీణాక్షి పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్ట్ నిర్మణం చేపట్టారు. సమితి, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో కలిసి కమిటీ సభ్యులు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. కమిటీ సభ్యులు అడిగిన ప్రాజెక్టు స్కెచ్ మ్యాప్‌ను.. ప్రాజెక్టు అధికారులు చూపించలేకపోయారని, పాత రిపోర్టును ఆధారంగా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలుసుకున్నట్లు సమాచారం. 2020లో పల్లె సభ రిపోర్టును పవర్ కంపెనీ చూపిందని, ఆ రిపోర్టును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బొయిపరిగుడ బీడీఓ అభిమన్య కవి శతపతి వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఉంటున్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. అవసరమైన రికార్డులను మంగళవారం నాటికి అందజేయాలని ప్రాజెక్టు అధికారులను కమిటీ ఆదేశించిందని సమాచారం. జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి పర్యవేక్షణలో జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ కుమార్ బెహర, జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, బొయిపరిగుడ తహసీల్దార్, కాలుష్య నియంత్రణ బోర్డు జిల్లా అధికారి, తదితరులు పాల్గొన్నారు.