
● ఆదిత్యా నమోస్తుతే..!
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఆదిత్యుని వార్షిక కల్యాణ మహోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) జరుగుతున్న క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద సంప్రదాయక పూజలు నిర్వహించి ప్రసాదాలను స్వామికి నివేదించారు. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాలు పూజలు చేయించుకున్నారు. ఎండ వేడిమి తీవ్రంగా ఉన్న కారణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయించారు.
విధుల్లోకి సిబ్బంది..
శనివారం విధులకు దూరంగా ఉన్న దినసరి వేతనదారులు ఆదివారం మాత్రం విధులకు వచ్చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రమంలో వారికి సౌకర్యాల కల్పన నుంచి ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, అన్నదానం, ప్రసాదాల తయారీ, విక్రయాలన్నీ దినసరి వేతనదారులే చూసుకున్నారు. ఈవో సూచన మేరకు ఈనెలాఖరు వరకు వేచిచూద్దామనే భావనను వ్యక్తం చేసి విధులను యధావిధిగా కొనసాగించారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,12,600, పూజలు, విరాళాల ద్వారా రూ.60,521, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1,15,880 వరకు ఆదాయం లభించినట్లు ఈవో వివరించారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
విధుల్లోకి దినసరి వేతనదారులు

● ఆదిత్యా నమోస్తుతే..!