
ప్రారంభమైన పోలీస్ హాకీ పోటీలు
భువనేశ్వర్: అఖిల భారత పోలీస్ క్రీడల నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ఒడిశా పోలీసులు నిర్వహిస్తున్న 73వ అఖిల భారత పోలీస్ హాకీ చాంపియన్‌షిప్ – 2025 సోమవారం ప్రారంభమైంది. స్థానిక ఏడో బెటాలియన్ గ్రౌండ్‌లో పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 15 వరకు స్థానిక కళింగ స్టేడియంలో ఈ పోటీలు నిరవధికంగా కొనసాగుతాయి. లీగ్ కమ్ నాకౌట్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌లో వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాల జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ పోటీలో పాల్గొనే అన్ని జట్లు, కోచ్‌లు, క్రీడా అధికారులను స్వాగతించారు. శారీరిక దారుఢ్యత, క్రమశిక్షణ, సమైక్యత భావాల ప్రేరణకు పోలీసు దళాలలో క్రీడల ప్రోత్సాహం ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. జాతీయ క్రీడలలో ప్రధానంగా వాటర్ స్పోర్ట్సు, షూటింగ్, హాకీలో ఒడిశా తారస్థాయి నైపుణ్యతతో ఎదుగుదల సాధించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా ప్రతిభను పెంపొందించడంలో రాష్ట్ర పోలీసుల ప్రయత్నాలను అభినందించారు. క్రీడాకారులు ఉమ్మడి కృషి, న్యాయసమ్మతమైన పోటీతో క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం చాంపియన్‌న్‌షిప్ ఇన్‌స్పెక్టరు జనరల్ (శిక్షణ), చాంపియన్‌షిప్ కార్యనిర్వాహక కార్యదర్శి అనుప్ కుమార్ సాహు పరిచయ ప్రసంగంతో ప్రారంభమైంది. అదనపు డీజీపీ (ప్రధాన కార్యాలయం)య కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షుడు దయాళ్ గంగ్వార్, అదనపు డీజీపీయ చాంపియన్‌షిప్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజేష్ కుమార్ పాల్గొన్నారు.