
హత్య కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: స్థానిక గగణాపూర్‌లోని సేవా పేపరు మిల్లు కాంట్రాక్ట్ కార్మికుడు పద్మన్ హరిజన్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. అరైస్టెనవారిలో పంపుణీ గ్రామానికి చెందిన నరేంద్ర హరిజన్, భగవాన్ హరిజన్‌లు ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి బైక్‌తో పాటు 3 కత్తులు, ఒక గొడ్డలి, ఒక ఇనుప రాడ్డు, ఒక కత్తి సీజ్ చేసినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 30వ తేదీ సాయంత్రం పద్మన్ హరిజన్ పేపరు మిల్లు నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. అయితే పాత శత్రుత్వం వలనే ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు.
● ఇదీ విషయం
గ్రామానికి చెందిన పద్మన్ హరిజన్‌కు, అలాగే అదే గ్రామంలో ఉంటున్న అన్నదమ్ములు నరేంద్ర, భగవాన్‌లకు మధ్య శత్రుత్వం ఉంది. దీంతో పద్మన్‌ను హత్య చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు ఒక మిత్రుడితో కలిసి ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఆరోజు పద్మన్ డ్యూటీ నుంచి బైక్‌పై 5 గంటల సమయంలో ఇంటికి బయల్దేరాడు. అతడిని గగణాపూర్ జంక్షన్ నుంచి నరేంద్ర అనుసరించాడు. అలాగనే బొనగుడ కొండ వద్ద భగవాన్, అతడి మిత్రుడు వేచి ఉన్నారు. పద్మన్‌ను వెంబడిస్తున్న నరేంద్ర ఫోను ద్వారా పద్మన్ రాకను భగవాన్‌కు తెలియజేశాడు. కొంత సమయం తర్వాత పద్మన్ బైక్ అక్కడకు వచ్చిన వెంటనే భగవాన్ ఒక గొడ్డలితో దాడి చేశాడు. ఆ దాడిలో పద్మన్ ఎడమ కాలుపై తీవ్ర గాయమైంది. అయినా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగు తీశాడు. అతడి వెనుక భగవాన్ గొడ్డలితోను, నరేంద్ర కత్తితోను, వారి మిత్రుడు ఇనుప రాడ్‌తో వెంబడించారు. పద్మన్‌ను వారు వెంటాడి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి భగవాన్, నరేంద్రలను అరెస్టు చేశామని, మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని కూడా అరెస్టు చేసి అందరినీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

హత్య కేసులో ఇద్దరు అరెస్టు