
కళలు, సంస్కృతిని పరిరక్షించాలి
రాయగడ: భిన్న సంస్కృతులు గల ఒడిశా రాష్ట్రం కళలకు పుట్టినిళ్లని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. వీటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక సంస్కృతి భవనంలో కళాకారుల సన్మాన కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సాహించేందుకు జిల్లా యంత్రాంగం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కళలనే నమ్ముకున్న సీనియర్ కళాకారులను సన్మానించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు. కళారంగం ఎప్పటికీ అలరించాలని, అందుకు కళాకారులను ప్రోత్సాహించడం మనందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంస్కృతి విభాగం అధికారి సస్మిత భౌరి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యాక్షులు సంతోష్ కుమార్ బొచ్చా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
జిల్లా కలెక్టర్ పట్వారి