
రసవత్తరంగా కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్ష పదవి
కొరాపుట్: ప్రతి పక్ష బీజేడి పార్టీకి కొరాపుట్ జిల్లా అధ్యక్ష పదవి కోసం రసవత్తర పోరు జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సగం జిల్లాలకు అధ్యక్ష స్థానాల ఎంపిక పూర్తయ్యింది. ఏ జిల్లాలోనూ ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పూర్తి బలంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక కష్టమవుతోంది.
కొరాపుట్ జిల్లాలో విభిన్నం
కొరాపుట్ జిల్లాలో ఈ పదవికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకు కారణం మాజీ మంత్రి రబినారాయణ నందో ఆసక్తి చూపడమే. ఆర్థికంగా బలంగా ఉన్న నందో దంపతులు అనూహ్యంగా ఈ పదవి పై ఆసక్తి చూపారు. దాంతో అందరి దృష్టి ఈ పదవి పై పడింది. గత నాలుగు నెలలుగా నందో దంపతులు తమదైన శైలి లో లాబీలు చేస్తున్నారు. తాము ఓడిపొయినా పార్టీని నమ్ముకొని దశాబ్ద కాలంగా పని చేస్తున్నామన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో రబినందోకి టికెట్ కేటాయించకుండా అతని సతీమణి ఇందిరా నందోకి టిక్కెట్ ఇచ్చి భారీ మూల్యం పార్టీ చెల్లించింది. దాంతో నందో కుటుంబం పై అధిష్టానం పెద్దలకు దృష్టి పడింది. తనకు పదవి ఇస్తే ఈ నాలుగేళ్లు జిల్లా వ్యాప్తంగా పార్టీ కోసం తిరిగి పని చేస్తానని రబినందో తేల్చి చెబుతున్నారు.
కిం కర్తవ్యం..
అవిభక్త కొరాపుట్ జిల్లాలో గత దశాబ్దకాలంగా కీలకమైన నేతగా ఈశ్వర్ చంద్ర పాణిగ్రహీ కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా ఈశ్వర్ కి పదవికి ఢోకా లేదు. ప్రస్తుతం అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆర్థికంగా శక్తి వంతమైన కొరాపుట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అందువల్ల నాలుగు జిల్లాలు తరచూ పర్యటిస్తున్నారు. దాంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పై ఆసక్తి చూపడం లేదు. కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఇష్టం లేక పోయినా అధ్యక్ష పదవి స్వీకరించాల్సి ఉంటుంది.
బద్ద శత్రుత్వం
రబినందో దంపతులు, ఈశ్వర్ పాణిగ్రహీలు ఒకే కమ్యూనిటీకి చెందినప్పటికీ బద్ద వైరం ఉంది. ఈ వైరం గత 27 ఏళ్లుగా కొనసాగుతోంది. రబినందో మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 15 ఏళ్ల పాటు ఈశ్వర్‌ను పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారని చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా ఈశ్వర్ హవా కొనసాగుతున్న సమయం లో నందో కుటుంబంకి రాజకీయ వేధింపులు జరిగాయని అంటున్నారు. వీరిద్దరి అంతర్గంత పోరుతో అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడింది.
మధ్యే మార్గం
అధికారంలో ఉన్నప్పుడు అధిష్టానం ఆదేశాలు అందరికి శిరోధార్యం. కానీ ప్రస్తుతం పార్టీ ప్రతి పక్షంలో ఉంది. రబి నందో కి పదవి ఇస్తే ఈశ్వర్ వర్గంకి కోపం వస్తుంది. ఇవ్వక పోతే నందో దంపతుల నిర్ణయం ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేక పోతున్నారు. దాంతో అధిష్టానం ఏ నిర్ణయం చేయలేక మధ్యే మార్గం గా మాజీ ఎంపీ జిన్ను హిక్క ని అధ్యక్షునిగా చేస్తారని సంకేతాలు వస్తున్నాయి. గతంలో జిన్ను అధ్యక్ష పదవిలో కొనసాగారు. అందువల్ల మళ్లీ జిన్నునే కొనసాగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రసవత్తరంగా కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్ష పదవి

రసవత్తరంగా కొరాపుట్ జిల్లా బీజేడీ అధ్యక్ష పదవి