
ప్రజా సమస్యల కోసం పోరాడాలి
రాయగడ: ప్రజా సమస్యపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు పిలుపునిచ్చారు. స్థానిక తేజస్వీ మైదానం వద్దనున్న బీజేడీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు దశాబ్ధాలుగా ప్రజల ఆదరణతో పాలించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. అయితే అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పథకాలు పేర్లు మాత్రమే మార్పులు చేస్తోందన్నారు. సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. అన్యాయం జరిగిన చోట తాము ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర ప్రజల వరపుత్రుడిగా పిలువబడే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత బిజూ పట్నాయక్ విగ్రహాన్ని తగలబెట్టడం, మొండెం వేరు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడినవారిపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, దీనికి తగిన సమాధానం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
ప్రణాళికతో ముందుకెళ్లాలి
రాష్ట్రంలో బీజేడీ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతోందని నెక్కంటి అన్నారు. కార్యకర్తలు ఏమాత్రం అసహనానికి గురవ్వకుండా ప్రణాళికతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, బి.తిరుపతి, సుజాత పాలో, కాసీపూర్ సమితి అధ్యక్షుడు కంఠొ మాఝి, రాయగడ సమితి ఉపాధ్యక్షుడు హర ప్రసాద్ హెప్రుక తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి

ప్రజా సమస్యల కోసం పోరాడాలి