
క్రికెట్ మైదానంలో గంజాయి ఒప్పందాలు
● ఇద్దరు ఒడిశా యువకులను అరెస్టు చేసిన కాశీబుగ్గ పోలీసులు
● 10 కేజీల గంజాయి స్వాధీనం
కాశీబుగ్గ: క్రికెట్ గ్రౌండ్‌లో ఆ యువకులకు పరిచయం ఏర్పడింది. ఓవైపు ఆడుతూనే.. మరోవైపు అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా తండిగుడ, తాళ్లబంద గ్రామాలకు చెందిన తపాన్ బెబారత, మాననిత్ సింగ్ ఇరుగుపొరుగు గ్రామాల యువకులు. తరచూ క్రికెట్ గ్రౌండ్‌లో కలుసుకునేవారు. పది కేజీల గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తే రూ.10 వేలు వస్తుందని ఒప్పందం కుదరడంతో ఇద్దరూ పలాసలోని రైలు నిలయానికి వచ్చారు. బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 10.39 కేజీల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

క్రికెట్ మైదానంలో గంజాయి ఒప్పందాలు