గుంటూరు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో చిన్నమ్మ, ఆమె ఇద్దరు పిల్లలను నరికి చంపిన ఘటన సంచలనం రేకెత్తించింది. సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో షేక్ రహీమూన్ (65), ఆమె కుమార్తె షేక్ మాలింబి (36), సత్తెనపల్లి పట్టణంలో ఆమె కుమారుడు షేక్‌రహిమాన్ (33) దారుణహత్యకు గురయ్యారు. పూర్తి వివరాలు.. సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్లకు చెందిన షేక్ ఖాశీంకు పెద్దమీరాసాహెబ్, చినమీరాసాహెబ్ కుమారులు. ఆయన మరణానంతరం ఇద్దరు కొడుకులకు చెరో రెండెకరాల పొలం వచ్చింది.
ఈ క్రమంలో పెదమీరాసాహెబ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఖాశిం, ఆయన కుమారుడు జాకీర్ వీరి వాటాగా వచ్చిన పొలం మొత్తం అప్పుల కారణంగా అమ్ముకున్నారు. వీరి కుటుంబం సత్తెనపల్లిలో నివాసం ఉంటుంది. చినమీరాసాహెబ్‌కు భార్య రహీమూన్ (65)తో పాటు ఒక కుమార్తె, ఇరువురు కుమారులు. చినమీరాసాహెబ్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో రహీమూన్ తన ముగ్గురు బిడ్డలతో ధూళ్లిపాళ్లలోనే నివశిస్తుంది. వీరిలో పెద్ద కుమారుడు జబ్బార్ 2021లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతి చెందాడు.
కుమార్తె షేక్ మాలింబీ (36) ఇంటివద్దే ఉంటుండగా, మరో కుమారుడు షేక్ రహిమాన్ (33) సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వీరందరినీ హతమారిస్తే రెండెకరాల ఆస్తి తనకే వస్తుందని ఆలోచించిన పెదమీరాసాహెబ్ పెద్ద కుమారుడు ఖాశీం బుధవారం తన కుమారుడు జాకీర్‌తో కలిసి ధూళ్లిపాళ్ల వెళ్లాడు. అక్కడ చిన్నమ్మ రహీమూన్, సోదరి మాలింబీని ఇంట్లోనే అతి కిరాతకంగా నరికాడు. రహీమూన్ అక్కడికక్కడే మృత్యువాత పడగా, మాలింబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
అనంతరం పిడుగురాళ్ల రోడ్డులోని ఎస్‌వీఆర్ దాభా హోటల్ వెనుక ప్రాంతంలో రహిమాన్‌ను పట్టుకుని హతమార్చారు. సత్తెనపల్లి డీఎస్పీ బి.ఆదినారాయణ, రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ ఆవుల బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఖాశింను పోలీసులు అదుపులోకి తీసుకోగా జాకీర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment