క్రషర్లపై తమ్ముళ్ల ‘కప్పం’ కక్ష
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడులో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఓ వైపు రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కేసులు, దాడులతో ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు వ్యాపారులను డబ్బుల కోసం బెదిరిస్త్తున్నారు. వారిని భయపెట్టి అడ్డుకుంటున్నారు. కప్పం కడితేనే వ్యాపారాలు చేసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారుల బిజినెస్ దెబ్బతింటుండగా, వాటిపై ఆధారపడి బతుకుతున్న కూలీల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల, గురజాలలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.
సాక్షి, నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండల పరిధిలో క్రషర్ వ్యాపారులపై టీడీపీ నేతల కన్నుపడింది. గతేడాది సార్వత్రిక ఎన్నికలలో మండలంలోని మూడు గ్రామాలకు చెందిన వ్యక్తులు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశారని వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు. గోలి, రెంటచింతల, మిట్టగుడిపాడు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముగ్గురు ఎంతో కాలంగా గ్రామ సమీపంలో క్రషర్లను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నాయకుల దృష్టి ఈ క్రషర్లపై పడటంతో వెంటనే వారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. క్రషర్ల నిర్వాహకులు కూడా ఆయా గ్రామాలలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని, వారిని ఆర్థికంగా దెబ్బతీసి కప్పం కట్టించుకోవాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారట. దీంతో మూడు క్రషర్లను మూసివేయించారు. మండలంలోని మిట్టగుడిపాడు గ్రామానికి చెందిన దోర్నాల బంగారురెడ్డి క్రషర్ 5 నెలలుగా, రెంటచింతలకు చెందిన కట్టమూరి నాగేశ్వరరావు, శ్రీనివాసరావుల క్రషర్లు, గోలి గ్రామానికి చెందిన మిర్యాల సుబ్బారావులకు చెందిన మరో క్రషర్ నెల రోజులుగా మూతపడ్డాయి.
రోడ్డున పడిన కూలీలు...
టీడీపీ నేతల దౌర్జన్యంతో మూడు క్రషర్లు మూతపడటంతో వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వందల కుటుంబాలకు ఉపాధి కరవైంది. ఈ మూడు క్రషర్ల పరిశ్రమలలో టిప్పర్లు, ట్రాక్టర్లు, జేసీబీల డ్రైవర్లు, క్లీనర్లు, ఆఫీసులలో గుమస్తాలతోపాటు సుమారు 120 మంది కూలీలు ప్రత్యక్షంగా జీవనోపాధిని కోల్పోయారు. పరోక్షంగా ఆధారపడిన చిరు వ్యాపారులు సైతం కూటమి కుతంత్రంతో కష్టాల పాలయ్యారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలే తప్ప వ్యాపారాలను మూయించడం వంటి పనులకు పాల్పడటం మంచిది కాదంటూ బాధిత కూలీలు మండిపడుతున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక క్రషర్ల నిర్వాహకులు బిక్కుబిక్కుమంటూ స్థానిక టీడీపీ చోటా నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. క్రషర్లు మూయించిన సంగతి తెలిసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
జూలకంటి.. ఇదేంటి..?
తాను ఎమ్మెల్యే అయితే ఎవరిపైనా కక్ష తీర్చుకోనని, వ్యాపారులను ఇబ్బంది పెట్టబోనని ఎన్నికల ముందు జూలకంటి బ్రహ్మారెడ్డి పదే పదే చెప్పారు. ఆయన గత నేపథ్యం నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా నీతి సూక్తులు చెబుతూ నమ్మించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్వభావం మారలేదంటూ నిరూపిస్తున్నారని ప్రజలు, వ్యాపారులు వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను తన పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. కక్షలకు స్వస్తి చెప్పి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
రెంటచింతలలో మూడు క్రషర్లు మూత అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణం జీవనోపాధి కోల్పోయిన చిరుద్యోగులు, కూలీలు రాజకీయ వేఽధింపులతో వ్యాపారుల్లో భయం
క్రషర్లపై తమ్ముళ్ల ‘కప్పం’ కక్ష
Comments
Please login to add a commentAdd a comment