తిరుగు ప్రభల సందడి
నరసరావుపేట ఈస్ట్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ శ్రీత్రికూటేశ్వరస్వామి సన్నిధిలో జాగరణ చేసి మొక్కులు తీర్చుకున్న ప్రభలు గురువారం పట్టణానికి చేరుకున్నాయి. పట్టణం నుంచి బుధవారం సాయంత్రం బయలుదేరి వెళ్లిన ప్రభలు రాత్రి స్వామివారి సన్నిధిలో ఉండి గురువారం ఉదయం బయలుదేరి వచ్చాయి. ప్రభల నిర్వాహకులకు మార్గమధ్యంలో పలువురు ఉచిత అల్పాహారం అందచేశారు. అలాగే పట్టణంలో శివునిబొమ్మ సెంటర్, పల్నాడు బస్టాండ్ ప్రాంతాల్లో సైతం అల్పాహారాలు అందించారు. మరోవైపు దూరప్రాంతాలకు వెళ్లే యాత్రికులతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. గత మూడురోజుల నుంచి కోటప్పకొండ వద్ద వ్యాపారాలు సాగించిన బొమ్మల దుకాణదారులు పట్టణంలోని ప్రధాన రోడ్లపై అమ్మకాలు జరిపారు. దీంతో పల్నాడు బస్టాండ్ ప్రాంతం నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ట్రాఫిక్‌ను మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment