నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నరసరావుపేటఈస్ట్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు పరీక్ష జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. శనివారం ఇంట ర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కా నున్నాయి. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 32,434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 30,560 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,874 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులలో బాలికలు 9,219, బాలురు 8,686 మంది, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 7,608, బాలురు 6,921 మంది ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఒక్కొక్క పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లను నియమించారు. వీరితోపాటు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 500మంది విద్యార్థులు దాటిన కేంద్రాలలో అదన పు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లను నియమించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ..
పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాలలోని పరీక్ష జరిగే గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సేపు సీసీ కెమెరా లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలను ఇంటర్మీడియెట్ బోర్డుతోపాటు బోర్డు జిల్లా కార్యాలయానికి అనుసంధానం చేశారు. పరీక్ష నిర్వహణ తీరును అధికారులు పర్యవేక్షించనున్నారు.
నో ఫోన్ జోన్..
పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఆయా కేంద్రాల సీఎస్, డీఓలతో సహా సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించేందుకు వీలులేదు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయటంతోపాటు చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08647–223355 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యకు పరిష్కారం పొందవచ్చు. కంట్రోల్ రూమ్‌లో ముగ్గురు పరీక్షల నిర్వహణ అధికారులు(డీఈసీఓ) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు హాజరు కానున్న 32,434 మంది విద్యార్థులు జనరల్ 30,560 మంది, ఒకేషనల్ 1,874 మంది విద్యార్థులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ
జిల్లాలో పరీక్షల నిర్వహణ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తాం. విద్యార్థులకు హాల్ టికెట్లు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా పంపించాం. ప్రిన్సిపల్ సంతకం లేకుండా పరీక్షకు అనుమతించాలని కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలిచ్చాం. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాం. విద్యార్థులు సకాలంలో హాజరై ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.
– ఎం.నీలావతిదేవి, డిఐఈఓ, పల్నాడుజిల్లా
Comments
Please login to add a commentAdd a comment