సాక్షి,నరసరావుపేట: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారి ఆగడాలు శృతిమించాయి. సత్తెనపల్లికి చెందిన పోలిశెట్టి ఆంజనేయ తరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హోటళ్ల వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. గతంలో సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట రాయల్ మండి బిర్యానీ హోటల్ సైతం నిర్వహించాడు. మూడు నెలల క్రితం వ్యాపార అవసరాల నిమిత్తం నగదు అవసరం కావడంతో బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంకు చెందిన వడ్డీ వ్యాపారి సయ్యద్ చిన్న మహబూబ్ అలియాస్ నన్నే అలియాస్ చిన్నా వద్ద రూ.40 లక్షలు అరువుగా తీసుకున్నాడు. దానికి వారం రోజుల క్రితం మరో రూ.60 లక్షలు వడ్డీ కలిపి మొత్తం రూ.కోటి ఇవ్వా లంటూ ఆంజనేయ తరుణ్‌ను సయ్యద్ చిన్న మహబూబ్ అలియాస్ నన్నే అలియాస్ చిన్నా వేధింపులకు గురి చేస్తున్నాడు. గత నెల 25న పోలిశెట్టి ఆంజనేయ తరుణ్‌ను నన్నేతో పాటు మరో ముగ్గురు కలిసి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. చండ్రాజుపాలెం, పులిచింతల డ్యామ్, బెల్లంకొండ, గుంటూరు తదితర ప్రాంతాలకు కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఆంజనేయ తరుణ్ ఎడమ చేయి మణికట్టు వద్ద మూడు అంగుళాల మేకును సైతం దించారు. అంతేకాక ఇనుప రాడ్డుతో దాడి చేసి మలద్వారంలోకి ఆ రాడ్డును దించారు. తట్టుకోలేక విలపిస్తుంటే రూ.కోటి డబ్బులు ఇవ్వకపోయినా, పోలీసుల దగ్గరకు వెళ్లినా నీ కొడుకును చంపేస్తామంటూ తరుణ్ తండ్రి ఆంజనేయ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. సెల్‌ఫోన్ సిగ్నల్ సాధారణంగా ట్రేస్ చేయగా పేరేచర్లలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకొని ఆంజనేయ తరణ్‌ను విడిపించి కిడ్నాపర్లు నలుగురుని అదపులోకి తీసుకున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
కూటమి నేతల అండతో రౌడీషీట్ ఎత్తివేత....
వడ్డీ వ్యాపారి సయ్యద్ చిన్న మహబూబ్ అలియాస్ నన్నే అలియాస్ చిన్నా పై గతంలో కూడా అనేక ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అవసరాలకు నగదు ఇచ్చి అత్యధిక వడ్డీలు వసూలు చేసేవాడు. డబ్బు తిరి గి ఇవ్వకపోతే చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇతనిపై పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల రౌడీషీట్‌ను ఎత్తివేశారు. దీంతో మళ్లీ ఆగడాలు శృతి మించాయి. ప్రస్తుతం కేసును కూడా నీరుగార్చేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారికి రూ.40 లక్షలు ఇచ్చి రూ.కోటి ఇవ్వాలంటూ బెదిరింపులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి చిత్రహింసలు ఎట్టకేలకు విడిపించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment