గుంటూరు లీగల్: విద్యుత్ చౌర్యం కేసులో జరిమానా విధిస్తూ జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వేల్పుల పెదఏసు 2016 నవంబరు 15న అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుండగా ఆ శాఖ అధికారి ఎం.కోటయ్య తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై ఆయన యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ కె. హనుమంతరావు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒకటో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి రూ. 85వేలు జరిమానా విధించారు. కట్టలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖరరెడ్డి వాదనలను వినిపించారు.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల నష్టం
చీరాల అర్బన్: ఈపురుపాలెంలో జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి చీరాల మండలం ఈపురుపాలెంలోని పాత ఇనుపసామాన్ల షాపులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక లక్షా 50 వేల రూపాయల విలువ గల సామగ్రి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాపు యజమాని సయ్యద్ అఫ్రీది నుంచి వివరాలు నమోదు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. గురువారం సాయంత్రం ఈపురుపాలెంలోని ఎస్‌బీఐ సమీపంలో ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి దగ్ధమైంది. మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదు. ఇంటి యజమాని చెరుకూరి నారాయణ నుంచి వివరాలను నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment