మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
నరసరావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మదర్‌థెరిస్సా, కల్పనా చావ్లా, సునీత విలయమ్స్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు పోలీసు విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విశ్వ క్రీడా వేదికపై మహిళలు రాణిస్తూ వారి దేశాల జెండాలను రెపరెపలాడిస్తున్నారని చెప్పారు.
అక్షరాస్యతలో ప్రతి ఏడాది మహిళల యొక్క అంకె పెరుగుతూ ఉందని వివరించారు. అయితే ఇంకా చిన్నారుల మీద, పసికందుల మీద లైంగికదాడులు జరుగుతూ ఉన్నాయని, వీటిని నివారించేందుకు ప్రభుత్వం చట్టాలు చేసి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఏర్పాటు చేయటంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మహిళలు పనిచేసే ప్రదేశం, వారు ప్రయాణించే వాటిలో కానీ, నివాసం ఉంటున్న చోట కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించేందుకు ఎన్నో టోల్ ఫ్రీ నంబర్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కానీ వాటిని ఉపయోగించుకునే మహిళల శాతం తక్కువగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డు ప్రొఫెసర్ టీడీ విమల, నరసరావుపేట లీగల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టి.అమూల్య, ఏరియా హాస్పిటల్ డాక్టర్ వెంకటరమణ, డీఈఓ ఎల్.చంద్రకళ, ఏఎంవీఐ మనీషా, ఐసీడీఎస్ పీడీ ఎస్.ఉమాదేవి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, సోషల్ మీడియాలో మహిళలకు గోప్యతను కాపాడే అవసరమైన డిజిటల్ భద్రత, స్వీయరక్షణ, మహిళలకు పని ప్రదేశాల భద్రత, వేధింపులపై మౌనాన్ని వీడటం, బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత సవాళ్లు, పరిష్కారాలు, మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పురుషుల పాత్ర, పని ప్రదేశంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి స్థానాలు, వ్యూహాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి వాటిపై సమగ్రంగా చర్చించారు. పరిపాలన విభాగ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కేవీ సుభాషిణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment