లీకు లాగితే కదిలిన డొంక
వినుకొండ: వినుకొండలోని వివేకానంద బీఈడీ కళాశాల వేదికగానే బీఈడీ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాస్పెక్టివ్ ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అక్రమాల డొంక కదులుతోంది. తొలి నుంచి కళాశాలలో అడ్మిషన్ దగ్గర నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేసే వరకు అవినీతి దందా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా డీఎస్సీ లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీ లేకపోవడం వల్ల ఇక్కడ బీఈడీకి ప్రాధాన్యం తగ్గిపోయింది. అయితే ఈ కోర్సుకు ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని వివేకానంద కళాశాల యాజమాన్యం ఒడిశా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ఏజెంట్ల ద్వారా అడ్మిషన్లు పొందిన ఒడిశా, ఇతర రాష్ట్రాల విద్యార్థులు లంచాలు సమర్పించి కళాశాలకు రాకుండా హాజరు వేయించుకుంటున్నారని తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఈ దందా సాగుతోందని సమాచారం. గతంలో ఇక్కడ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి మరీ పరీక్షలు రాయించేవారు. మారిన నిబంధనల ప్రకారం 2024 నుంచి ప్రశ్నాపత్రం ఆన్‌లైన్‌లో పంపిస్తుండడంతో కళాశాల యాజమాన్యం పరీక్ష సమయానికంటే ముందే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ఒడిశా విద్యార్థులకు రూ.లక్షలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. తాజాగా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాస్పెక్టివ్ పేపర్ లీక్ విషయం బయటకు పొక్కడంతో వివేకానంద కళాశాల యజమాని సయ్యద్ రఫీక్ అహ్మద్‌తోపాటు కళాశాల కంప్యూటర్ ఆపరేటర్ మరి కొంతమంది సిబ్బందిని గుంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నడుస్తున్న ఈ కళాశాలలో ఈ తంతు ఏటా గుట్టుగా జరుగుతూనే ఉందని సమాచారం. ఇదిలా ఉంటే లీకైన ప్రశ్నాపత్రాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ బుధవారం పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
వివేకానంద బీఈడీ కళాశాల అక్రమాలెన్నో..
ప్రశ్నపత్రం లీక్‌తో గుట్టురట్టు విద్యార్థుల జీవితాలతో యాజమాన్యం చెలగాటం ఏళ్ల తరబడి ఇదే తంతు
తొలి నుంచీ అదే తీరు
వినుకొండ వివేకానంద బీఈడీ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫీక్ అహ్మద్ పై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులూ ఉన్నాయి. రాష్ట్ర విభజనకు పూర్వం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తూ ఏసీబీకి పట్టుబడిన కేసులు నడుస్తున్నాయి. తాజాగా వినుకొండలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు పొక్క డంతో ఈ కళాశాలపై ప్రభుత్వం కఠిన చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment