తులసీ తన్మయ్‌కు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల నర్సింగ్ విద్యార్థిని వి.తులసీతన్మయ్ తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు ఆదివారం తెలిపారు. తెనాలిలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 5వ గుంటూరు (జిల్లా) ఆహ్వాన తైక్వాండో చాంపియన్‌షిప్–2025 పోటీలో తులసీ తన్మయ్ 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించినట్టు వివరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, నర్సింగ్ విభాగం ఇన్‌చార్జి ఏవీఎన్ గుప్త తదితరులు అభినందించారు.
రైలు కింద పడి
మహిళ ఆత్మహత్య
నరసరావుపేట టౌన్: కేసానుపల్లిరోడ్డులోని టిడ్కో గృహాల పక్కనే ఉన్న రైలుపట్టాలపై ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుంటూరు –డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు బండి కింద పడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుందని రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ తెలిపారు. మృతురాలు శరీరం నలుపు రంగుతోను, ఒంటిపై నీలం రంగు పూల డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. మృతేదేహాన్ని స్థానిక ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చామన్నారు.
సహజీవనం చేసి
పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు
పాయకాపురం(విజయవాడరూరల్): మహిళతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై నున్న పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురం ఎల్‌బీఎస్ నగర్‌కు చెందిన పల్లపు నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది. తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పొలం పనులు చేసుకునే ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మోజెస్ విజయవాడ వస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె సత్తెనపల్లి వెళ్లి మోజెస్ తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అతను రెండు నెలల్లో పెళ్లి చేసుకొంటానని చెప్పి గుంటూరు నెహ్రూనగర్ పాత బస్‌స్టాండ్ వద్ద రూమ్ తీసుకొని కొన్ని నెలలు కాపురం చేసి వెళ్లిపోయాడు. నాగదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment