బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
నరసరావుపేట: కేంద్రంలోని బీజేపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన పల్నాడు బస్టాండ్‌లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే, విశ్వకర్మ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఒక హోటల్‌లో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు కేంద్రంలో బీసీ కులాల జనగణన చేపడతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతోందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తెస్తామని, నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించడానికి బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజులు ఓసీలతో సమానంగా వసూలు చేస్తున్నారని, వెంటనే లా సెట్, ఎంసెట్, పాలీసెట్, ఇతర అన్ని రకాల సెట్లకు బీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు యామా మురళి మాట్లాడారు. సంఘం నరసరావుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా సుతారం విశ్వేశ్వరరావును నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కాకుమాను రమేష్, నరసరావుపేట, రొంపిచర్ల మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, గాలి సాంబశివరావు, రజక సంఘ నాయకులు చట్టూ శ్రీరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment