పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర ఆరోపించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, లీకేజీలను అరికట్టాలంటూ శుక్రవారం గుంటూరు జిల్లా ఆత్మకూరు వద్ద జాతీయ రహదారి పక్కనున్న రాష్ట్ర విద్యాభవన్ కార్యాలయం ఎదుట ఽవైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క లీకేజీ కాలేదని గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు పేపర్ల లీకేజీ జరుగుతుందని విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా ప్రశ్నపత్రాలు లీకేజీమయం అని దుయ్యబట్టారు. కడపలో మ్యాథ్స్ పేపర్ లీకేజీ ఘటనపై తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, వారంతా లేకేజీల ఘటనలతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షలలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం నాయకులు కె.శివారెడ్డి, ఐ. శ్రీనివాస్, ఎం. గోపీచంద్, కొండలరావు, సురేష్, ప్రతాప్, పూజిత, నాగరాజు, రాము, సురేంద్ర పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ స్టూడెంట్ విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్