
1, 2 తేదీల్లో జాతీయస్థాయి నాటకోత్సవాలు
తెనాలి: పట్టణానికి చెందిన డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయస్థాయి నాటకోత్సవాలు ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. కళాపరిషత్ వ్యవస్థాపకుడు డీఎల్ కాంతారావు, ప్రధాన కార్యదర్శి పీఎస్సార్ బ్రహ్మాచార్యులు ఆదివారం విలేకరుల సమావేశంలో నాటకోత్సవాల ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఒకటో తేదీ సాయంత్రం 6.30 గంటలకు నాటకోత్సవాల ప్రారంభసభకు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు నాయుడు గోపి అధ్యక్షత వహిస్తారు. విశాఖపట్నంకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి, దర్శకురాలు కె.విజయలక్ష్మికి నందమూరి తారక రామారావు లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా బహూకరిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘జేబు చెప్పిన ఊసులు’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తారు. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి మంజునాథ దర్శకత్వం వహిస్తారు. 2వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు డీఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళాపరిషత్, తెనాలి వారిచే ‘ది లెసన్’ సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటికను పీఎస్సార్ బ్రహ్మాచార్యులు దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 7.30 గంటలకు శ్రీసాయి కళానికేతన్ వెల్ఫేర్ సొసైటీ, విశాఖపట్నం వారి పౌరాణిక పద్యనాటకం ‘శశిరేఖా పరిణయం’ (మాయాబజార్) ప్రదర్శిస్తారు. విద్వాన్ కన్వశ్రీ రచించిన ఈ నాటకానికి బీవీఏ నాయుడు దర్శకత్వం వహిస్తారు.