సూపర్‌ సిక్స్‌ ప్రస్తావనే లేదు | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌ ప్రస్తావనే లేదు

Apr 2 2025 1:29 AM | Updated on Apr 2 2025 1:29 AM

సూపర్‌ సిక్స్‌ ప్రస్తావనే లేదు

సూపర్‌ సిక్స్‌ ప్రస్తావనే లేదు

చీరాల : ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ప్రజలను నిరుత్సాహపర్చాడు. గతంలో జిల్లాకు ఇచ్చిన హామీల గురించిగానీ, పరిశ్రమల స్థాపన గురించిగానీ ప్రస్తావించకుండా పొంతన లేని మాటలు చెప్పి వెళ్లారు. వచ్చాడు...వెళ్లాడు అనే చందంగా సాగింది సీఎం పర్యటన. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో మంగళవారం పింఛన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ గ్రామంలో 304 నివాస గృహాలు ఉన్నారు. 996 మంది జనాభా నివసిస్తున్నారు. 138 పింఛన్లు ఉన్నాయి. తీరప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కోస్టల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి తద్వారా పరిశ్రమలను తీసుకువచ్చి వెనుకబడిన బాపట్ల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని జిల్లాప్రజలు ఆశించారు. చివరకు ఎమ్మెల్యే ఏలూరి సైతం షిప్‌ బ్రేకింగ్‌, షిప్‌ బిల్డింగ్‌ యూనిట్లు పెట్టాలని కోరినప్పటికీ అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేస్తానని చెప్పారే తప్ప గట్టి హామీ ఇవ్వలేకపోయారు. చీరాల్లో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఫిషింగ్‌ హార్బర్‌ నిధులు, నిర్మాణం గురించి ఊసే ఎత్తలేదు. బంగారు కుటుంబం, మార్గదర్శులు కావాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారే తప్ప ప్రభుత్వం నుంచి పరిశ్రమల ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. సెల్‌ఫోన్‌ నేనే తెచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ఏలూరి ఎత్తిపోతల పథకాలు లేకపోవడం వలన రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తే చంద్రబాబు మాత్రం తాను అన్నీ బాగు చేసి వెళ్తే వచ్చే వారు మళ్లీ చెడగొట్టి వెళ్తున్నారని అనడం చూస్తే ఆయనకు మళ్లీ అధికారంలోకి వస్తారో....లేదో...అనే అనుమానం ఉన్నట్లు సభకు హాజరైన వారు చర్చించుకోవడం విశేషం. పేదరికంలేని సమాజాన్ని చూపించేందుకు 2029లో కృషి చేస్తానన్నారు. 12.40 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు సమావేశం మధ్యాహ్నం 2.45 గంటల వరకు బోరుగా సాగింది. గత ప్రభుత్వం అప్పులు ఇచ్చి వెళ్లింది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా కానీ సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని ప్రతి సభలో చెప్పిన విధంగానే చినగంజాం సభలో చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఆరోగ్యం బాగోలేకపోయినా మీటింగ్‌కు రండి

కేవలం వ్యాపారవేత్తలకు, బడా వ్యక్తులకు పేదలను దత్తత పంపేందుకే, బడా వ్యాపారవేత్తలు పేదలకు ఏవిధంగా ఆర్థిక చేయూతనివ్వాలో తెలిపేందుకు సభ నిర్వహించారా అని ప్రజలు చర్చించుకున్నారు. పింఛన్ల పంపణీలో భాగంగా ఎల్లావుల వెంకాయమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆమె కూతురు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా సీఎం చంద్రబాబు ఆ కుటుంబాన్ని మీటింగ్‌కు రావాలని కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆలయంలో పూజలు

కొత్తగొల్లపాలెంలో ఉన్న దేవాలయంలో చంద్రబాబు పూజలు చేశారు. పూజారైన పెద్దగొల్లను మీటింగ్‌కు వద్దకు రావాలని చంద్రబాబు పిలవడం ఆసక్తిగా అనిపించింది.

యువకుడికి వార్నింగ్‌

ఒక యువకు సీఎం సార్‌ ప్లీజ్‌ అంటూ ఫ్లకార్డు, అర్జీ పట్టుకోగా కడుపు నొప్పిగా ఉందా....సమస్య ఉంటే నేరుగా రా....చిల్లర వేషాలు వేస్తే ట్రీట్‌మెంట్‌ ఇస్తా అని చంద్రబాబు అనడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

ప్రజాధనం వృథా

చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం మినహా ప్రజాసేవ, ప్రజావేదిక వలన జరిగిన ప్రయోజనం మాత్రం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం నలుగురికి పింఛన్లు పంపిణీ చేసేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం చంద్రబాబుకు తగునా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నేను బాగుచేస్తాను..

మళ్లీ వచ్చినోళ్లు చెడగొడుతున్నారు

పథకాలపై స్పష్టమైన

హామీల్లేని ప్రసంగం

నిరుత్సాహ పరిచిన

చంద్రబాబు పర్యటన

ఎత్తిపోతల పథకాల గురించి

పట్టించుకోని సీఎం

మూడు గంటలు సాగిన పర్యటన

కేవలం పింఛన్ల పెంపుదల చేసింది....పేదలకు 20 రకాలైన పింఛన్లు అందిస్తున్నాని చెప్పడమే కానీ సూపర్‌ సిక్స్‌ పథకాలు గురించి కానీ, ఉచిత బస్సుకానీ, మహాలక్ష్మి పథకం కానీ ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో ప్రజలు నిరాశ పడ్డారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు..జిల్లాకు మంచి వరాలు....పేద ప్రజలకు సంక్షేమ పథకాల గురించి గొప్ప హామీలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశించిన ప్రజలు సీఎం చంద్రబాబు ప్రసంగంతో భంగపాటుకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement