
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
నకరికల్లు: ఉపాధిహామీ పథకంలో తమను ఫీల్డ్ అసిస్టెంట్‌లుగా చేర్చుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ విధుల్లోకి తీసుకోవడం లేదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన కె.శివగోపి, ఆవుల సుకన్య, ఎన్.మేరీ వసంతకుమారి, పల్నాటి చెన్నకేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు నకరికల్లు ఎంపీడీఓ జి.కాశయ్యను మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని అకారణంగా అధికారులు తమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించినా తీసుకోకపోవడంతో రిజిస్టర్ పోస్టుద్వారా పంపామని అయినా విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో తమకు అన్యాయం జరిగిందని ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించగా తమను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ తమను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీడీఓ జి.కాశయ్యను వివరణ కోరగా డిపార్ట్‌మెంట్ లీగల్ అడ్వయిజర్‌ను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోని అధికారులు