
ఎన్జీటీ కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా ప్రతినిధులు
ఏఎన్‌యూ(గుంటూరు): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జియాలజీ విభాగాధిపతి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు ఆచార్య పొన్నెకంటి జోసఫ్ రత్నాకర్ పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విగ్యాన్ భవన్‌లో ఈనెల 29, 30 తేదీలలో జరిగిన ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్‌మెంట్– 2025’లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్యతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సును ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించగా 30వ తేదీ సాయంత్రం జరిగిన ముగింపు సభకు ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్‌ఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో ప్రస్తుతం పర్యావరణం ఎదుర్కొంటున్న సవాళ్లు, పర్యావరణ నిర్వహణలో ఉత్తమ పద్ధతుల అనుసరణ, పర్యావరణ పరిరక్షణలో పలు విభాగాల భాగస్వామ్యం, సుస్థిర పర్యావరణ నిర్వహణ కోసం భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రతినిథులు హాజరై చర్చించారు. వారి అభిప్రాయాలను తెలియజేసి నివేదికల రూపంలో అందజేశారు. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్, ఎన్‌జీటీ చైర్మెన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరామణి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.