ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
బెల్లంకొండ: ప్రకతి వ్యవసాయ విధానంలో మండలంలో సాగు చేస్తున్న వరి, కంది, కూరగాయల క్షేత్రాలను గురువారం పలు జిల్లాలకు చెందిన వ్యవసాయ, వెలుగు, ప్రకృతి వ్యవసాయ అధికారులు పరిశీలించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకతి వ్యవసాయ క్షేత్రాలకు వీరిని తీసుకువెళ్లి డీపీఎం అమలకుమారి వివరించారు. బీజామృతం, విత్తన గుళికలు, ద్రవ జీవామతం, ఘనజీవామృతం, నీమాస్త్రం తయారు చేస్తున్న విధానాలను మహిళా రైతులు వారికి వివరించారు. కంది పంటలో ఏ గ్రేడ్ మోడల్ వ్యవసాయ క్షేత్రాన్ని చూపించి, కంది పంటలో ఐదు నుండి పది రకాల అంతర పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని తెలిపారు. నిరంతరం ఆదాయం ఇచ్చే ఏటీఎం మోడల్ సూర్య మండలం మోడల్‌లో 27 రకాల కూరగాయల పంటలను రైతుల పండిస్తున్నట్లు తెలిపారు. భూమిలో వివిధ రకాల పంటలు వేయడం వలన జీవవైవిద్యం పెరిగి భూమి సారవంతం అవుతుందని పేర్కొన్నారు. వరి పొలం గట్లపై అరటి, కొబ్బరి, బొప్పాయి, జామ, బంతి పలు రకాల చెట్లను నాటడాన్ని వివరించారు. కందిపాడు గ్రామంలో రైతు నాగమల్లేశ్వరరావు సాగు చేస్తున్న ప్రధాన పంట దొండ పందిరి తోటను, అందులో అంతర పంటలుగా వేసిన టమోటో బంతి చిక్కుడు ఆముదం పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్, మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, ప్రకతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.