
ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెంచాలి
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెంచాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. రావిపాడు రోడ్డులోని బృందావనంలో మంగళవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 28 మండలాల్లో 222 వీఓ సంఘాల పరిధిలో 132 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయ విధానం కొనసాగుతుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సాగు చేపట్టాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో భాగంగా మొదటగా 56 గ్రామాలు, రెండవ విడతలో 64 గ్రామాలు మొత్తం 120 గ్రామాల్లో నూతనంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను పండించడం వలన జీవకోటికి ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుందనితెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజు, జిల్లా ఎన్‌ఎఫ్‌ఏలు నందకుమార్, సౌజన్య, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.