
కన్నకొడుకే కాలయముడు
● మతి స్థిమితం లేని తల్లిని చంపిన కొడుకు ● మంచంపై నిద్రిస్తుండగా రోకలి బండతో మోది హత్య
బొల్లాపల్లి: కన్న కొడుకు చేతిలో జన్మనిచ్చిన తల్లి దారుణంగా హత్యకు గురైన సంఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గురువారం జరిగింది. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్, బండ్లమోటు ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వెల్లటూరు గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య, గజ్జ సోమమ్మ (67) దంపతులకు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ సంతానం. చిన్న కుమారుడు బాదరయ్య అవివాహితుడు కావడంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మిగిలిన సంతానంలో అందరికీ వివాహాలై వేర్వేరుగా ఉంటున్నారు. మతిస్థిమితం లేని తల్లి ఎప్పుడు గొణుగుతుండడం, తనకు వివాహం కాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న నిందితుడు బాదరయ్య తెల్లవారుజామున మంచం మీద పడుకుని నిద్రిస్తున్న తల్లిని రోకలిబండతో కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు గజ్జ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అందజేశారు.

కన్నకొడుకే కాలయముడు