
కోతకు రబీ వరి.. కళ్లాల్లో మిర్చి, కంది
ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో రైతుల గుండెలు ఝల్లుమన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎక్కడ తడిసిపోతాయోనని వాటిని కాపాడుకోడానికి అష్టకష్టాలు పడ్డారు. మరో వైపు కంది కళ్లాలు జరుగుతున్నాయి. కళ్లాలను త్వరగా పూర్తి చేసేందుకు రైతు కూలీలు కష్టపడ్డారు. వర్షం రాకతో కళ్లం చేసిన గింజలతో కూడిన పొట్టును మిషన్‌లో పోసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిరప కాయల కోతలు కూడా జరుగుతున్నాయి. దీంతో కోసిన కాయలు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు రబీ వరి చేలన్నీ కోతకు వచ్చాయి. ఈ దశలో వర్షం పడితే గింజ పాడైపోతుందని, గింజలు నేలపాలు అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎరువుల కొట్లలో బాకీలున్న చిన్న సన్నకారు రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని జిలకర సన్నాలు 75 కిలోల బస్తా రూ.1540కే తెగనమ్మారు. అమ్ముదామంటే ధరలేదు.. కొనేనాథుడు లేడని వర్షం వల్ల బతిమాలి మరీ పంటను అమ్మాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోతకు రబీ వరి.. కళ్లాల్లో మిర్చి, కంది