
కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!
● జిల్లావ్యాప్తంగా 24 పాఠశాలల్లో నోటిఫికేషన్ విడుదల ● 6వ తరగతి, ఇంటర్మీడియెట్‌లో దరఖాస్తుల ఆహ్వానం ● ఏప్రిల్ 11వరకు స్వీకరణ
బెల్లంకొండ: బాలిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకు వేళయింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన బాలికలు ఆరవ తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం పొందవచ్చు.
● జిల్లావ్యాప్తంగా 24 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధించే ఈ విద్యాలయాల్లో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఒక్కో పాఠశాలలో 40 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన ఈ విద్యా సంవత్సరం 960 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో పాఠశాలలో ఒక ఇంటర్మీడియెట్ కోర్సు కేటాయించి బాలికలతో విద్యాభ్యాసం చేయిస్తున్నారు. ఒక్కొక్క కేజీబీవీలో 40 మంది చొప్పున ఇంటర్మీడియట్‌లో కూడా 960 సీట్లను భర్తీ చేస్తారు. అదేవిధంగా 7, 8, 9, 10 తరగతులతోపాటు, ఇంటర్ సెకండియర్ ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నారు.
● అనాథ పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, డ్రాప్ అవుట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అదేవిధంగా ఇంటర్‌లో ప్రవేశాలకు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
● కేజీబీవీలలో ఆన్‌లైన్‌లో https:/ apkgbv. apcfss. in/వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో సందేహాలు సమస్యల నివృత్తి కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 అందుబాటులో ఉంచింది.
బాలికలకు మంచి అవకాశం
కస్తూర్బా పాఠశాలల్లో బాలికలు చదువుకోవడానికి గొప్ప అవకాశం. ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు. ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తూ నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందజేస్తుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పాఠశాలలు ఎంతో తోడ్పడతాయి. ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
– టి.వెంకట సుబ్బారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్, పల్నాడు జిల్లా