
న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు
13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ
నరసరావుపేటటౌన్: న్యాయవ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ పేర్కొన్నారు. గురువారం అదనపు జిల్లా కోర్డు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. పారా లీగల్ వలంటీర్ల విధులు, నైతికత, రాతపూర్వక నైపుణ్యం, రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను, చట్టపరమైన సలహాలు ఇచ్చే విధివిధానాలను గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించేలా కృషి చేయాలని సూచించారు.
ధాన్యం సేకరణ లక్ష్యం
10వేల మెట్రిక్ టన్నులు
నరసరావుపేట: రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ 10వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ సమావేశం వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. రబీలో 2024–25 సంవత్సరానికి 234 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 20,561 హెక్టార్లలో వరిసాగు చేశారన్నారు. దీనిలో 1,32,773 ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటా రూ.2320లు, సాధారణ రకం క్వింటా రూ.2300లుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ–పంట ద్వారా పంటను నమోదుచేయించి 100శాతం ఈకేవైసీ చేయించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను త్వరగా కాలిబ్రేషన్ చేయించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నారదమునిని ఆదేశించారు. రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం, ఇతర వివరాలు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులు కొనుగోలుకేంద్రాల ద్వారా తాము పండించిన పంటను విక్రయించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి, జిల్లా సప్లయీస్ మేనేజర్, ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రతినిధులు, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వారం రోజుల పాటు దాదాపు 1.75లక్షల పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. దాదాపు 1050మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గదుల్లో అదనపు వెలుతురు, గాలి వచ్చేలా లైట్లు, స్టాండ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
5, 6 తేదీల్లో ఇంటర్ దూరవిద్య మూల్యాంకనం
సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 5, 6తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం తెలిపారు. కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రెండు రోజుల పాటు 11 సబ్జెక్ట్‌లకు సంబంధించిన 16,215 పేపర్లు మూల్యాంకనం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకుగాను 191 మంది ఎగ్జామినర్లు, 38 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 39 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించినట్టు తెలిపారు.
7 నుంచి దూరవిద్య ప్రాక్టికల్స్..
ఇంటర్మీడియెట్ దూరవిద్య ప్రాక్టీకల్ పరీక్షలు ఈనెల 7వతేదీ నుంచి 11వరకు నిర్వహిస్తున్నట్టు డీఈఓ తెలిపారు. ఆయా తేదీలలో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. ఇందుకుగాను నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండలో 6 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు