
‘వక్ఫ్’ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
● ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచేది వైఎస్సార్ సీపీనే ● బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వడం మైనార్టీలకు వెన్నుపోటు పొడవటమే ● మాజీ సీఎం జగన్‌పై వర్లరామయ్య ఆరోపణలు సిగ్గుచేటు ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘించి ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వటమంటే మైనార్టీలకు వెన్నుపోటు పొడవటమేనన్నారు. ఈ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని, మైనార్టీలకు అండగా ఉండేది, వారికోసం నిలబడేది తమ పార్టీనేనని గోపిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ మైనార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిమేతర వ్యక్తిని వక్ఫ్‌బోర్డు కమిటీలోకి తీసుకురావటం 26వ ఆర్టికల్‌ను ఉల్లంఘించటమేనన్నారు. ఇప్పటివరకు ముస్లిం వ్యక్తులే కమిటీలో ఉంటున్నారన్నారు. దీంతో ఆస్తులు అన్యా క్రాంతమవుతాయనే భయాందోళన ముస్లిం వర్గాల్లో వ్యక్తమవుతుందన్నారు.
మైనార్టీలను వంచించిన టీడీపీ, జనసేన..
వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆర్నెల్లులో సెంట్రల్ డేటా బేస్‌లోకి తీసుకురావటం సాధ్యమయ్యే పనికాదన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఏవిధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిని కమిటీలో నియమిస్తున్నారని, ఆ అధికారిని రాష్ట్రమే నిర్ణయించటం వలన రాష్ట్రంవైపే ఆ అధికారి మొగ్గుచూపే అవకాశం ఉంటుందన్నారు. ఈ సవరణకు టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వటంపై రాష్ట్రంలోని ప్రతి మైనార్టీసోదరుడు ఆవేదన చెందుతున్నాడన్నారు. రాష్ట్రంలో ఉన్న ఖరీదైన వక్ఫ్ ఆస్తులను ఏంచేయనున్నారోననే ఆందోళన ప్రతి ముస్లింకి ఉందన్నారు. దేశంలో సుమారు 20 కోట్లమంది ముస్లింలు ఉండగా వారికి ఆల్‌ఇండియా ముస్లిం లా బోర్డు, జమాయిత్ హిందూ ఉల్ అనే సంస్థలు ఉండగా వాటిని చర్చలకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఒక మతానికి చెందిన అంశాలను మార్చుతున్నప్పుడు ఆ మత పెద్దల అభిప్రాయాలు, సూచనలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్‌ను ముస్లిం లా బోర్డు బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముస్లింల హక్కులు కాలరాయకుండా వారితో ముందుగానే చర్చలు ఎందుకు జరపలేదని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు.
వర్ల రామయ్య వ్యాఖ్యలు సిగ్గుచేటు
వర్లరామయ్య నరసరావుపేటకు వచ్చి బిల్లు విషయంలో తమ పార్టీ టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నాడని, దీనిపై తాము ఆయనతో చర్చించేందుకు సిద్ధమేన్నారు. దీంతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటన్నారు. టీడీపీ మద్దతు ఇవ్వకపోయినా బిల్లు పాస్‌అయ్యేదన్న వర్లరామయ్య మాటను ప్రస్తావిస్తూ మద్దతు ఇవ్వకపోయినా పాస్ అయినా మద్దతు ఇవ్వటమే ఇక్కడ ముఖ్యమైన అంశమన్నారు. ఇమామ్, మౌజమ్‌లకు రూ.10వేలు, రూ.5వేలు పారితోషికం అందజేసింది జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ అవకాశాన్ని రద్దుచేసింద న్నారు. దివంగత వైఎస్సార్ ఇచ్చిన 4శాతం రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వలన ఎంతో మంది మైనార్టీలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారని, నరసరావుపేట మండలంలోని చినతురకపాలెంలో పేద బడుగు ముస్లిం కుటుంబాలకు చెందిన 32మంది యువతీయువకులు ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్లు అయ్యారని, వారిలో ఎనిమిదిమంది పీజీలు చదువుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.