
బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకే తప్పుడు కేసు
నరసరావుపేటటౌన్: బాకీ డబ్బులు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఏలూరి ప్రసాద్ విమర్శించారు. గురువారం ప్రకాష్‌నగర్ సిరి అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అమరా వెంకటేశ్వరరావు బాధితులతో కలిసి మాట్లాడారు. పట్టణానికి చెందిన అమరా వెంకటేశ్వరరావు అమరా ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహిస్తూ ఆర్థిక సమస్యలతో 2023లో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అతనికి సన్నిహితంగా ఉండే వారి వద్ద సుమారు రూ.10 కోట్లు అప్పుగా తీసుకొని ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించాడన్నారు. కాలేజీని కోర్టు వేలం వేసి బ్యాంకుకు చెల్లించవలసిన పైకం పోనూ మిగిలిన మొత్తాన్ని సొసైటీ పేరిట సుమారు రూ.4 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారన్నారు. వెంకటేశ్వరరావు మృతి అనంతరం ఆయన భార్య అమరా సుధారాణి, వారి పిల్లలు బాకీదారులతో సన్నిహితంగా ఉంటూ ఉన్న ఆస్తిని అమ్మి బాకీలు తీరుస్తామని నమ్మబలుకుతూ వచ్చారన్నారు. ఇటీవల నరసరావుపేటలో ఐపీ పెట్టే వారి సంఖ్య పెరగటంతో వీళ్లు కూడా డబ్బులు ఎగ్గొట్టాలని దురాలోచన చేశారన్నారు. అందులో భాగంగానే బుధవారం సుధారాణి తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి నిజానిజాలు తెలుసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా కోరారు. సమావేశంలో కండె హనుమంతరావు, కూరపాటి శ్రీనివాస గుప్తా, కొత్తూరు సురేషు, పెనుగొండ ప్రతాపు, పెనుగొండ ప్రభాకర్, సీతారామయ్య, చీరాల నారాయణ, ఇక్కుర్తి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.