
కేంద్రియ విద్యాలయాలు ఏర్పాటు చేయండి
నరసరావుపేట: పల్నాడు జిల్లాకు సంబంధించి రొంపిచర్ల, మాచర్లలో మంజూరైన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలోని తన చాంబర్‌లో రెవెన్యూ అధికారులు, కేంద్రియ విద్యాలయ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాచర్లలో అనువైన ప్రదేశాన్ని గుర్తించి తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై మాచర్ల రెవెన్యూ అధికారి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీ, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో రూములు కేటాయించడానికి అనువుగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పీడబ్ల్యూడీ కాలనీలో ఐదెకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్లలో విద్యాలయ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని రీ వెరిఫై చేయాలని ఎమ్మార్యోకు సూచించారు. గురజాల, నరసరావుపేట ఆర్డీవోలు మురళీకృష్ణ, మధులత, రొంపిచర్ల మండల రెవెన్యూ అధికారి నిర్మల, కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీకమిషనర్ పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం