
పోయిన డబ్బులు దొరికాయోచ్..!
ముప్పాళ్ళ: పింఛన్ డబ్బులు పోయాయి... మరలా దొరికాయోచ్...! అవును ఇది నిజమే. డబ్బులు కట్టకట్టి మరీ గ్రామసచివాలయంలోనే ఉంచడం మరింత ఆశ్చర్యకరం. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామ సచివాలయంలో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్ పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్ములో రూ.50 వేలు ఈ నెల 1వ తేదీన గ్రామ సచివాలయంలోనే పంపిణీకి ముందు కనిపించకుండా పోయాయి. సహచర సిబ్బంది, మిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకొని పింఛన్ పంపిణీని సజావుగా పూర్తి చేశారు. మూడు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే శుక్రవారం ఉదయం సచివాలయం తెరవగానే రూ.50 వేల నగదును ఒక కవర్‌లో పెట్టి నేలపై కనిపించాయి. ఇదంతా ఇంటి దొంగల పనే అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా సచివాలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
బోయపాలెం డైట్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెం జిల్లా వృత్తి విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల్లో డెప్యూటేషన్‌పై పని చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎంఈఓలు, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈనెల 16,17వ తేదీల్లో పరీక్షలు, ఈనెల 19న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డైట్‌బోయపాలెం.కామ్ సందర్శించాలని, సందేహాల నివృత్తికి 94408 46046 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తును ప్రతి సబ్జెక్టుకు వేర్వేరుగా చేయాలని, దరఖాస్తుల స్వీకరణకు గుంటూరు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జీజీహెచ్‌లో మీకోసం మేము
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో 7వ వారం మీకోసం మేము పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ పేషెంట్‌లకు హాస్పిటల్ నియమావళి గురించి సూచనలు చేశారు. ల్యాబ్ పరీక్షలు, మరేదైనా ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు మోసపోవద్దని తెలిపారు. ఎలాంటి సమస్యనైనా ఎవరికీ డబ్బు చెల్లించవద్దని, ఒకవేళ ఎవరైనా డబ్బు అడిగితే రశీదు అడగాలని, ఇవ్వని పక్షంలో సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఓంకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సింగ్గ్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
మూల్యాంకన
కేంద్రంలో పరిశీలన
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. కేబీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్న మూల్యాంకన కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా మార్కులు కేటాయించాలన్నారు. సకాలంలో మూల్యాంకనం పూర్తి చేయాలని సూచించారు. కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్, మూల్యాంకనం గదులు, వైద్య సదుపాయం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.ఎం.ఎ.హుస్సేన్, డిప్యూటీ డీఈఓలు ఎస్‌ఎం సుభాని, ఏసుబాబు పాల్గొన్నారు.

పోయిన డబ్బులు దొరికాయోచ్..!